జమిలి ఎన్నికలపై భాజపా నేతృత్వంలో 25 వెబినార్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్న ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అంశంపై విస్తృతంగా చర్చించి, ప్రజల్లో అవగాహన....

Updated : 27 Dec 2020 12:57 IST

ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్న ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అంశంపై విస్తృతంగా చర్చించి, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి భాజపా నాయకత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా 25 వెబినార్‌లను నిర్వహించనుంది. ఈ వెబినార్లలో పార్టీ సీనియర్‌ నేతలు, న్యాయనిపుణులు, విద్యావేత్తలు పాల్గొని వారివారి అభిప్రాయాలను వెల్లడించనున్నారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రధాని మోదీ జమిలి ఎన్నికల అంశంపై పట్టుదల ప్రదర్శిస్తున్నారు. ‘‘దేశంలో ప్రతి సంవత్సరం కొన్ని నెలలపాటు ఎక్కడోచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అవి అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల ఒకే దేశం, ఒకే ఎన్నిక అన్న అంశంపై లోతైన అధ్యయనం, చర్చలు చేపట్టాల్సిన అవసరం ఉంది’’ అని నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. గత ఏడాది మే 30న అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఇదే అంశంపై పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. దీనిపై అన్ని రాజకీయపార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని