కొవిడ్‌ బాధితులతో బ్రిటన్‌ ఆసుపత్రులు కిటకిట!

బ్రిటన్‌ మరోసారి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొత్తరకం కరోనా వైరస్‌ శరవేగంగా సోకుతుండటంతో... ఆసుపత్రులన్నీ ...

Updated : 30 Dec 2020 04:57 IST

బెంబేలెత్తిస్తున్న కొత్త స్ట్రెయిన్‌

లండన్‌: బ్రిటన్‌ మరోసారి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొత్తరకం కరోనా వైరస్‌ శరవేగంగా సోకుతుండటంతో... ఆసుపత్రులన్నీ కొవిడ్‌ బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. మహమ్మారి తొలిసారి విజృంభించిన మొదటి వారంలో, ఏప్రిల్‌ 12న వివిధ ఆసుపత్రుల్లో గరిష్ఠంగా 18,974 మందికి వైద్యం అందించగా... సోమవారం కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌కు గురైన 20,426 మందికి చికిత్స చేశామని నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) అధ్యక్షుడు సైమన్‌ స్టీవెన్స్‌ పేర్కొన్నారు. మూడు వారాల కిందట ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకా తొలి డోసు తీసుకున్నవారికి మంగళవారం నుంచి రెండో డోసు వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి వ్యాక్సిన్‌ కేంద్రాన్ని స్టీవెన్స్‌ సందర్శించి, విలేకరులతో మాట్లాడారు. ‘‘మహమ్మారి రెండో వేవ్‌ యూరప్‌ను చుట్టుముడుతోంది. చాలామంది కుటుంబ సభ్యులను, స్నేహితులను, సహచరులను కోల్పోయారు. ఏటా ఈ సమయంలో మేము వేడుకలు చేసుకుంటాం. అలాంటిది... ప్రస్తుతం చాలామంది భయాందోళనలకు, నిస్పృహకు లోనయ్యారు. అయినా ధైర్యం వీడకూడదు. ఆశావహ దృక్పథం చాలా అవసరం. వ్యాక్సిన్‌ పంపిణీకి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్‌లోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో మునుపటి కంటే ఇప్పుడే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని యూకే డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డా.సమంత భట్‌-రాడెన్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని