బ్రిటన్‌కు‌ రాకపోకలు మరికొంత కాలం బంద్‌!

బ్రిటన్‌ కేంద్రంగా కొత్తరకం కరోనా వైరస్‌ వ్యాపిస్తున్నందున, ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని...

Updated : 30 Dec 2020 08:21 IST

ఈనాడు, దిల్లీ: బ్రిటన్‌ కేంద్రంగా కొత్తరకం కరోనా వైరస్‌ వ్యాపిస్తున్నందున, ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరికొంత కాలం పొడిగించే అవకాశముందని పౌర విమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ మంగళవారం వెల్లడించారు. కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ కలకలం సృష్టిస్తున్న క్రమంలో... భారత్‌-బ్రిటన్‌ మధ్య ఈనెల 23 నుంచి 31 వరకూ కేంద్రం విమానసేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చినవారిలో పలువురికి కరోనా కొత్త స్ట్రెయిన్‌ సోకినట్టు తేలడంతో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఉభయ దేశాల మధ్య విమాన సేవలు, కొత్త వైరస్‌ కట్టడి వంటి అంశాలపై ఒకట్రెండు రోజుల్లో ఆలోచన చేస్తామన్నారు.
కేంద్రం ‘వందే భారత్‌ మిషన్‌’ ద్వారా 42 లక్షల మంది భారతీయులను విదేశాల నుంచి సొంత గడ్డకు తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా కేరళకు 8 లక్షల మంది చేరుకున్నారని మంత్రి వివరించారు. వివిధ దేశాల నుంచి తెలంగాణకు మొత్తం 1,84,632 మంది వచ్చినట్లు వెల్లడించారు. కొవిడ్‌కు ముందు 40 దేశాలకు రాకపోకలు సాగించిన ఎయిర్‌ ఇండియా... కరోనా సమయంలో 75 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిందన్నారు.
ఆరు కేంద్రాల్లో పైలట్‌ శిక్షణ
దేశంలో పైలట్ల శిక్షణ కోసం బెళగావి, జల్‌గావ్‌, కలబుర్గి, ఖజురహో, లీలాబరి, సేలంలో 12 పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 7 వేల మంది పైలట్ల అవసరం ఉంటుందని చెప్పారు.
విదేశాల నుంచి వస్తే.. జన్యు పరీక్షలు
బ్రిటన్‌ కేంద్రంగా కొత్తరకం వైరస్‌ వ్యాపిస్తున్న క్రమంలో... దేశంలో స్ట్రెయిన్‌ను పసిగట్టి, వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈనెల 9 నుంచి 22 మధ్య భారత్‌కు వచ్చి, పాజిటివ్‌గా తేలిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో వైరస్‌ జన్యు క్రమాన్ని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించనుంది. మిగతావారికి ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించి, కొద్దిరోజుల పాటు వారిని పర్యవేక్షిస్తారు.

ఇవీ చదవండి..

కొత్త కలవరం

కొత్త కరోనా పెంచుతోంది హైరానా!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని