యెమెన్‌ ప్రధాని లక్ష్యంగా బాంబు దాడి

యెమెన్‌లోని ఏడెన్‌ విమానాశ్రయంలో బుధవారం విధ్వంసం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి మయీన్‌ అబ్దుల్‌ మాలిక్‌ సయీద్‌ సహా పలువురు

Published : 31 Dec 2020 05:01 IST

22 మంది దుర్మరణం

50 మందికి గాయాలు

సనా: యెమెన్‌లోని ఏడెన్‌ విమానాశ్రయంలో బుధవారం విధ్వంసం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి మయీన్‌ అబ్దుల్‌ మాలిక్‌ సయీద్‌ సహా పలువురు మంత్రులతో కూడిన విమానాన్ని లక్ష్యంగా చేసుకొని బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 22 మంది మృత్యువాతపడ్డారు. 50 మంది గాయపడ్డారు. ప్రధాని సహా మంత్రులకు ముప్పు తప్పింది. వారందర్నీ భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. తాజా విధ్వంసానికి పాల్పడిందెవరన్న సంగతి ప్రస్తుతానికి తెలియరాలేదు. ప్రధానమంత్రి, పలువురు మంత్రులతో సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌ నుంచి వచ్చిన విమానం విమానాశ్రయంలో దిగిన కొద్ది క్షణాల్లోనే డ్రోన్ల సాయంతో బాంబు దాడి చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రుల్లో రెడ్‌ క్రాస్‌ కార్యకర్తలు ఉన్నారని తెలిపాయి. వారు యెమెన్‌ వాసులో విదేశీయులో ఇంకా నిర్ధారణ కాలేదని పేర్కొన్నాయి. విమానాశ్రయంలో దాడి అనంతరం నగరంలోని ఓ భవంతిలో కేబినెట్‌ మంత్రులను అధికారులు ఉంచగా.. అక్కడికి సమీపంలోనే మరో పేలుడు సంభవించడం గమనార్హం. యెమెన్‌ మంత్రి మండలిని దేశాధ్యక్షుడు అబెద్‌ రబ్బో మన్సౌర్‌ హాదీ గతవారమే పునర్‌ వ్యవస్థీకరించారు. అంతర్యుద్ధంతో దేశం అతలాకుతలమవుతున్న నేపథ్యంలో రియాధ్‌ నుంచే హాదీ పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని