సారీ.. భారత్‌కు రాలేను

బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి విచారం వ్యక్తం చేశారు. కరోనా కొత్త ‘స్ట్రెయిన్‌’ కారణంగా బ్రిటన్‌లో ఏర్పడిన ప్రజారోగ్య సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా జనవరి 26 నాటి గణతంత్ర దినోత్సవానికి హాజరుకాలేకపోతున్నట్టు...

Published : 06 Jan 2021 04:30 IST

మోదీకి తెలిపిన బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి విచారం వ్యక్తం చేశారు. కరోనా కొత్త ‘స్ట్రెయిన్‌’ కారణంగా బ్రిటన్‌లో ఏర్పడిన ప్రజారోగ్య సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా జనవరి 26 నాటి గణతంత్ర దినోత్సవానికి హాజరుకాలేకపోతున్నట్టు తన అశక్తతను వ్యక్తపరిచారు. బ్రిటన్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తూ టెలివిజన్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడిన మరుసటిరోజే బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్‌ చేశారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో బ్రిటన్‌ అధ్యక్షత వహించనున్న జీ 7 దేశాల సమ్మేళనానికి ముందే భారత్‌ సందర్శిస్తానని జాన్సన్‌ తెలిపారు. ఈ పరిస్థితుల్లో తమ ప్రధాని దేశంలో ఉండి, స్థానిక పరిస్థితులపై దృష్టి పెట్టడం అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు డౌనింగ్‌ స్ట్రీట్‌ అధికార ప్రతినిధి తెలిపారు. అగ్రనేతలు ఇద్దరూ కరోనా నేపథ్యంలో తమ తమ బాధ్యతలను గుర్తెరిగి, ఉభయ దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా మాట్లాడుకున్నట్టు చెప్పారు. ఇంగ్లండ్‌ ఆసుపత్రుల్లో కొవిడ్‌-19 బాధితుల సంఖ్య వారం రోజుల్లో పెరిగింది. డిసెంబరు 29న జరిపిన పరీక్షల్లో రికార్డు స్థాయిలో 80 వేల మందికి పైగా పాజిటివ్‌ ఉన్నట్టు తేలింది. మరణాల సంఖ్య కూడా గత వారం కంటే 20 శాతం పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని