ఆజాద్‌కు వీడ్కోలు.. మోదీ కంటతడి

రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌... మరో ముగ్గురి పదవీకాలం వారం రోజుల్లో ముగియనుంది. ఈ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారికి వీడ్కోలు

Updated : 10 Feb 2021 12:02 IST

విపక్ష నేత సేవలను కొనియాడుతూ శాల్యూట్‌

దిల్లీ: రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌... మరో ముగ్గురి పదవీకాలం వారం రోజుల్లో ముగియనుంది. ఈ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారికి వీడ్కోలు చెబుతూ ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆజాద్‌ సేవలను, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు. గద్గద స్వరంతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. సభలో ఉన్న ఆయనవైపు చూస్తూ ప్రధాని శాల్యూట్‌ చేశారు!
దేశం గురించి ఆలోచించే నాయకుడు
‘‘ఆజాద్‌ తన పార్టీ గురించే కాదు... యావద్దేశం గురించి, సభ గురించి ఆలోచించే వ్యక్తి. విపక్ష నేతగా ఆయన పెద్ద బాధ్యతే చేపట్టారు. ఆయన స్థానాన్ని భర్తీ చేసేవారు లేరు. కొవిడ్‌ సమయంలో నాకు ఫోన్‌చేసి, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. నేను అలానే చేశాను. ఆజాద్‌జీకి అధికార, విపక్ష సభ్యునిగా దశాబ్దాల అనుభవముంది. ఆజాద్‌జీ జమ్మూ-కశ్మీర్‌ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు నేను గుజరాత్‌ సీఎంగా ఉన్నాను. మేమిద్దరం తరచూ మాట్లాడుకునేవాళ్లం. జమ్మూ-కశ్మీర్‌లో పర్యటిస్తున్న గుజరాత్‌ యాత్రికులపై ఉగ్రదాడి జరగ్గానే ఆజాద్‌జీ మొదట నాకు ఫోన్‌చేసి, కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాలను దగ్గరుండి విమానంలో పంపడమే కాకుండా... అవి గుజరాత్‌ చేరేవరకూ ఆయన విమానాశ్రయంలోనే ఉండిపోయారు. అధికారం వస్తుంది, పోతుంది... కానీ, నేను ఒక స్నేహితునిలా ఆజాద్‌జీని ఎప్పటికీ గౌరవిస్తాను. ఇన్నేళ్లుగా ఆయన చేసిన సేవలు అలాంటివి. ఆజాద్‌ జీ! సభలో లేము కదాని అనుకోవద్దు. మా ద్వారాలు ఎప్పటికీ తెరిచే ఉంటాయి. మీ విలువైన సలహాలు మాకు అవసరం. మిమ్మల్ని బలహీనులను కానివ్వను’’ అని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
అంతకుముందు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ- అధికార, విపక్ష సభ్యునిగా ఆజాద్‌ ఎంతో చిత్తశుద్ధిగా వ్యవహరించారని కొనియాడారు. ఈనెల 15తో ఆజాద్‌ పదవీ కాలం ముగుస్తుంది. నజీర్‌ అహ్మద్‌ లావే (పీడీపీ), శంషేర్‌ సింగ్‌ మన్‌హాస్‌ (భాజపా), మిర్‌ అహ్మద్‌ ఫయాజ్‌ (పీడీపీ)ల రాజ్యసభ పదవీకాలమూ వారం రోజుల్లో ముగియనుంది.
హిందూస్థానీ ముస్లిం కావడం గర్వకారణం: ఆజాద్‌
ఇండియన్‌ ముస్లింని కావడం తన అదృష్టమని గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. రాజ్యసభకు వీడ్కోలు సందర్భంగా 28 నిమిషాల పాటూ ఆయన ప్రసంగించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే... మహాత్మాగాంధీ, నెహ్రూ, మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌ల జీవిత చరిత్రలు తన రాజకీయ జీవితానికి బాటలు పరిచాయన్నారు. ఆ ప్రయాణం 41 సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చిందన్నారు. ‘‘ఇందిరాగాంధీ, సంజయ్‌జీల కారణంగానే ఇక్కడి వరకూ చేరుకోగలిగాను. అయిదుగురు రాష్ట్రపతులు, అయిదుగురు ప్రధానులతో కలిసి పనిచేశాను. పూర్వ ప్రధాని వాజ్‌పేయీతోనూ నాకు ప్రత్యేక అనుబంధముంది. భాజపాతో కాకుండా, ఆయనతో టచ్‌లో ఉండాలని ఇందిరాజీయే నాకు చెప్పేవారు. ఈ దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమేయాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. జమ్మూ-కశ్మీర్‌లో శాంతి పునఃస్థాపన జరగాలని, కశ్మీరీ పండిట్లు మళ్లీ వెనక్కు రావాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ఆజాద్‌ పేర్కొన్నారు. కశ్మీర్‌ నుంచి వీడి వెళ్లినవారికి అంకితమిస్తూ ఓ పద్యాన్ని ఆయన చదివి వినిపించారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి, ప్రధాని మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పలువురు సభ్యులు ఆజాద్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని