Updated : 19/02/2021 05:56 IST

కరోనాపై పోరులో ప్రాంతీయ సహకారం

ప్రధాని మోదీ ఆకాంక్ష

దిల్లీ: కరోనాపై పోరాటం చేయడంలో దక్షిణాసియా దేశాలు, హిందూ మహాసముద్ర ద్వీపాల మధ్య ప్రాంతీయ సహకారం అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. గురువారం పది పొరుగు దేశాల ప్రతినిధులతో ‘కరోనా నిర్వహణ: అనుభవాలు, మంచి పద్ధతులు, భవిష్యత్తు నిర్దేశం’ అనే అంశంపై జరిగిన కార్యశాలలో ఆయన ప్రసంగించారు. పరస్పర సహకారమే కరోనా నేర్పిన గుణపాఠమని అన్నారు. 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం కావాలంటే దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ద్వీపాల ప్రమేయం లేకుండా అది సాధ్యం కాదని చెప్పారు. ఈ ప్రాంతంలో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. ఆరోగ్య రంగంలో సహకారం బాగుందని, దీన్ని మరింతగా విస్తరించాల్సి ఉందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి చెందిన వైద్యులు, నర్సులు త్వరగా ప్రయాణం చేయడానికి వీలుగా ప్రత్యేక వీసాలు ఉంటే బాగుంటుందని సూచించారు. కరోనా టీకాల సమర్థతను అధ్యయనం చేసే విషయంలోనూ సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు.
ఆస్ట్రేలియా ప్రధానితో సంభాషణ
ప్రధాని మోదీ గురువారం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌తో ఫోన్‌లో సంభాషించారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉండాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత, ఇతర ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపారు.

అసోం అభివృద్ధికే అధిక ప్రాధాన్యం

ఈనాడు, గువాహటి: అసోం విషయంలో జరిగిన చారిత్రక తప్పిదాలను తమ ప్రభుత్వం సరిదిద్దుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధిని నిర్లక్ష్యం చేయగా, తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. రూ.10వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్టు తెలిపారు. రూ.3,231 కోట్ల వ్యయంతో నిర్మించిన మహాబాహు బ్రహ్మపుత్ర ప్రాజెక్టును గురువారం ఆయన వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలకు జల రవాణా సౌకర్యం కలిగించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం, అసోంలలో భాజపా ప్రభుత్వాలే ఉండడంతో రెండు ఇంజిన్ల వేగంతో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. బ్రహ్మపుత్ర నది అసోంకు గర్వకారణంలాంటిదని అన్నారు. అది తెచ్చే వరదల కారణంగా దాన్ని అసోం దుఃఖదాయినిగా అభివర్ణించేవారని చెప్పారు. తమ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసి ఆ మచ్చను తొలగిస్తోందని అన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని