Published : 23/03/2021 05:25 IST

దేశ్‌ముఖ్‌ రాజీనామా అవసరం లేదు

 స్వరం మార్చిన పవార్‌

ముంబయి: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సంచలన ఆరోపణల వ్యవహారంలో సోమవారం కూడా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన పార్టీకి చెందిన దేశ్‌ముఖ్‌కు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అండగా నిలిచారు. దేశ్‌ముఖ్‌ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై సీబీఐతో నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలంటూ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు చేసిన ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్ష భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ మరోసారి అధికార మహా వికాస్‌ అఘాడీ కూటమిపై విమర్శల దాడి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన నివాసం వద్ద బందోబస్తు పెంచారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాల వాహనం కేసులో పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే అరెస్టు, పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ బదిలీ, ఆ క్రమంలోనే అనిల్‌ దేశ్‌ముఖ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పరమ్‌వీర్‌ శనివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాయడం కల్లోలం రేపిన సంగతి తెలిసిందే.  
స్వరం మార్చిన పవార్‌
దేశ్‌ముఖ్‌పై వచ్చిన విమర్శలు తీవ్రమైనవని ఆదివారం పేర్కొన్న పవార్‌ సోమవారానికి స్వరం మార్చారు. పరమ్‌వీర్‌ చేస్తున్న ఆరోపణలను కొట్టిపడేశారు. ఫిబ్రవరి మధ్యలో వాజేను దేశ్‌ముఖ్‌ ముంబయిలోని తన అధికారిక నివాసానికి పిలిపించుకున్నారని పరమ్‌వీర్‌ లేఖలో పేర్కొన్నారని, అయితే దేశ్‌ముఖ్‌కు కరోనా సోకడంతో ఆ నెల 5 నుంచి 15 వరకూ తన సొంత పట్టణం నాగ్‌పుర్‌లోని ఆసుపత్రిలో ఉన్నారని పవార్‌ చెప్పారు. 15 నుంచి 27 వరకూ హోం క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. దానికి సంబంధించి ఆసుపత్రి సర్టిఫికెట్‌ కూడా ఉందని చెప్పారు. పరమ్‌వీర్‌ చేసిన ఆరోపణలు నిజం కాదని తేలింది కనుక కాబట్టి దేశ్‌ముఖ్‌ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.  
ఎన్సీపీ వాదన అవాస్తవం: ఫడణవీస్‌
దేశ్‌ముఖ్‌ ఫిబ్రవరిలో ఆసుపత్రిలో ఉన్నారని పవార్‌ చెబుతున్న మాటలు అవాస్తవమని భాజపా నేత ఫడణవీస్‌ పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న దేశ్‌ముఖ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారని ట్వీట్‌ చేస్తూ, దానికి సంబంధించిన వీడియోని పోస్ట్‌ చేశారు. దీనిపై దేశ్‌ముఖ్‌ ట్విటర్‌లోనే బదులిచ్చారు. 15న తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి బయటకి వచ్చాక అక్కడే మీడియా ప్రతినిధులు ఉండటంతో వారితో మాట్లాడానని చెప్పారు. అనంతరం ఇంటికి వెళ్లి క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు. అధికార కూటమిపై విమర్శలు చేస్తున్న ఫడణవీస్‌ ఇంటికి సోమవారం భద్రత కల్పించారు. ఎన్సీపీ శ్రేణులు ఆయన ఇంటి ముందు నిరసన చేపట్టనున్నారన్న సమాచారంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. మరోవైపు దేశ్‌ముఖ్‌పై భాజపా ఎమ్మెల్యే అతుల్‌ భత్ఖల్కర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన అక్రమ వసూళ్లపై విచారణ జరపాలని కోరారు. బుధవారం గవర్నర్‌ను కలసి ఈ అంశంపై పూర్తి నివేదికను రాష్ట్రపతికి పంపించాలంటూ కోరతామని భాజపా నేత సుధీర్‌ ముంగంటివార్‌ చెప్పారు. వంచిత్‌ బహుజన్‌ అఘాడీ నేత ప్రకాశ్‌ అంబేడ్కర్‌ సోమవారం గవర్నర్‌ కోశ్యారీని కలిశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.
సుప్రీంలో పరమ్‌వీర్‌ పిటిషన్‌
దేశ్‌ముఖ్‌ అవినీతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ పరమ్‌వీర్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయడం గమనార్హం. తనను పోలీస్‌ కమిషనర్‌ స్థానం నుంచి హోం గార్డ్స్‌ విభాగానికి డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేయడం సరికాదని, దాన్ని రద్దు చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. సోమవారం ఆయన హోం గార్డ్స్‌ చీఫ్‌ బాధ్యతలను స్వీకరించారు. పోలీస్‌ కమిషనర్‌గా ఉన్నప్పుడు పరమ్‌వీర్‌ తన నుంచి రూ.2 కోట్లు లంచం డిమాండ్‌ చేశారని ముంబయి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అనూప్‌ డాంగే ఆరోపించారు. తాను సస్పెండ్‌ అయినప్పుడు తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవడానికి ఆ సొమ్ము అడిగారని అనూప్‌ చెప్పారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని