రక్తసిక్తమైన మయన్మార్‌

మయన్మార్‌ వీధుల్లో శనివారం మరణ మృదంగం మోగింది. 76వ సైనిక దినోత్సవాన.. భద్రతా బలగాలు పేట్రేగిపోయాయి. సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను

Updated : 28 Mar 2021 12:11 IST

 ఒక్క రోజే కాల్పుల్లో 114 మంది మృతి!

యాంగూన్‌: మయన్మార్‌ వీధుల్లో శనివారం మరణ మృదంగం మోగింది. 76వ సైనిక దినోత్సవాన.. భద్రతా బలగాలు పేట్రేగిపోయాయి. సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను పిట్టలను కాల్చినట్లు కాల్చేశాయి. శనివారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో 114 మంది కాల్పుల్లో చనిపోయారు. వీరి సంఖ్య ఇంకా అధికంగా ఉండొచ్చని స్థానిక మీడియా చెబుతోంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తే తలపైన, వెనుక భాగాన కాల్చేస్తామని శుక్రవారం రాత్రి హెచ్చరించినా ప్రజలు ఖాతరు చేయకపోవడంతో సైన్యం రెచ్చిపోయింది. దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపింది. ఫిబ్రవరి 1న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి, సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఈ స్థాయిలో రక్తపాతం సంభవించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు సైన్యం కాల్పుల్లో 400 మందికిపైగా పౌరులు చనిపోయారు. సైనిక దినోత్సవం సందర్భంగా..తిరుగుబాటుకు నేతృత్వం వహించిన జనరల్‌ మిన్‌ అంగ్‌ లయాంగ్‌... శనివారం టీవీలో ప్రసంగించారు. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు ఈ మారణకాండను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హింసకు బాధ్యులైన వారిని తప్పకుండా శిక్షిస్తామని. వారిని వదలిపెట్టబోమని బ్రిటన్‌ విదేశాంగమంత్రి డొమినిక్‌ రాబ్‌ అన్నారు.
బుల్లెట్‌ గాయాలతో భారత్‌లోకి
సైనిక హింసను తట్టుకోలేని మయన్మార్‌ పౌరులు భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. శుక్రవారం ముగ్గురు మయన్మార్‌ జాతీయులు మణిపుర్‌లోని సరిహద్దు ప్రాంతంలోకి వచ్చారు. తీవ్రమైన బుల్లెట్‌ గాయాలతో ఉన్న వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని