Published : 05 Apr 2021 04:42 IST

మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ.. వారాంతంలో లాక్‌డౌన్‌

ఏప్రిల్‌ 30 వరకు ఆంక్షలు

ముంబయి: మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూతో పాటు వారాంతపు లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుందని స్పష్టంచేసింది. తాజా ఆంక్షలు సోమవారం రాత్రి నుంచే అమలులోకి వస్తాయని పేర్కొంది. ఏప్రిల్‌ 30 వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) వెల్లడించింది. ఆదివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎంవో తెలిపింది. పగటి పూట 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుందని.. వచ్చే శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ప్రతి వారాంతంలోనూ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. బ్యాంకింగ్‌, స్టాక్‌మార్కెట్‌, బీమా ఫార్మా, టెలికమ్యూనికేషన్‌ రంగాలకు దీని నుంచి మినహాయింపునిచ్చింది.షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, చిన్నచిన్న దుకాణాలు, సినిమా థియేటర్లు పూర్తిగా మూసివేయాలని మహా సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు కేవలం 50 శాతం సామర్థ్యంతోనే పని చేసేందుకు చర్యలు తీసుకోవాలంది. కొవిడ్‌ నిబంధనలతో పారిశ్రామిక, నిర్మాణ కార్యకలాపాలకు మాత్రం అనుమతి ఇచ్చింది. పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని..  10, 12 తరగతులకు ముందుగా నిర్దేశించిన సమయంలోనే పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
పైవేట్‌ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేలా ఆయా సంస్థలు చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే సూచించారు. బ్యూటీ పార్లర్లు, సెలూన్లనూ మూసివేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
చండీగఢ్‌: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కార్యాలకు హాజరయ్యే వారి సంఖ్యపై పరిమితి విధిస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో జరిగే శుభకార్యాలకు 500 మంది, ఇంటివద్ద అయితే 200 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆదేశించింది. అదేవిధంగా అంత్యక్రియల్లో పాల్గొనే వారి సంఖ్యనూ 50కే పరిమితం చేస్తూ ఆదివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదిలాఉంటే ఛత్తీస్‌గఢ్‌ నుంచి తమ రాష్ట్రంలోకి రాకపోకలపై పరిమితులు విధిస్తున్నట్లు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని