రోజుకు 10 లక్షల కేసులు.. 5 వేల మరణాలు

భారత్‌లో కొవిడ్‌-19 విజృంభణ.. మే ప్రథమార్ధంలో గరిష్ఠ స్థాయికి చేరుతుందని మిషిగన్‌ విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధుల విభాగం ప్రొఫెసర్‌ భ్రమర్‌ ముఖర్జీ పేర్కొన్నారు. అప్పటికల్లా ప్రభుత్వపరంగా వెల్లడించే రోజువారీ కేసుల సంఖ్య 10 లక్షలకు, మరణాలు 5వేలకు చేరే అవకాశం ఉందని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌’ (ఐహెచ్‌ఎంఈ) నమూనా సాయంతో ...

Updated : 24 Apr 2021 06:10 IST

భారత్‌లో మే ప్రథమార్ధంలో గరిష్ఠ స్థాయికి కరోనా ఉద్ధృతి
మిషిగన్‌ వర్సిటీ శాస్త్రవేత్త భ్రమర్‌ ముఖర్జీ అంచనా

ఈనాడు, దిల్లీ: భారత్‌లో కొవిడ్‌-19 విజృంభణ.. మే ప్రథమార్ధంలో గరిష్ఠ స్థాయికి చేరుతుందని మిషిగన్‌ విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధుల విభాగం ప్రొఫెసర్‌ భ్రమర్‌ ముఖర్జీ పేర్కొన్నారు. అప్పటికల్లా ప్రభుత్వపరంగా వెల్లడించే రోజువారీ కేసుల సంఖ్య 10 లక్షలకు, మరణాలు 5వేలకు చేరే అవకాశం ఉందని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌’ (ఐహెచ్‌ఎంఈ) నమూనా సాయంతో ఆమె విశ్లేషించారు. ఆగస్టు నాటికి ఉద్ధృతి తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. ‘‘వెలుగులోకి రాని కేసులతో కలిపి మొత్తం ఇన్‌ఫెక్షన్లు మే మధ్యనాటికి గరిష్ఠ స్థాయిలో 45 లక్షలకు చేరొచ్చు. పరిస్థితులు దిగజారితే అది 50 లక్షలకూ చేరే ప్రమాదం ఉంది. భారత్‌లో ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసులు మాత్రమే వెల్లడిస్తున్నా పరిస్థితులు అంతకంటే దారుణంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ కఠినమైన లాక్‌డౌన్‌లు విధించడం, మాస్క్‌లు తప్పనిసరిగా ఉపయోగించడం, భారీ సమూహాలను నిషేధించడం, అంతర్రాష్ట్ర రాకపోకలను నియంత్రించడం, వ్యాక్సినేషన్‌ పెంచడం ద్వారా గణాంకాలను తగ్గించవచ్చు. మే నెలలో కేసులు గరిష్ఠానికి చేరినప్పటికీ మనం మళ్లీ సాధారణ జీవితం గడపగలమని విశ్వసించే స్థాయికి కేసులు, మరణాలు తగ్గడానికి మరికొంత సమయం పడుతుంది. వైరస్‌ జన్యుపరిణామ క్రమ విశ్లేషణను పెంచడంతోపాటు, ప్రజారోగ్య వ్యవస్థను అత్యంత అప్రమత్తం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. భారత్‌కు ఇప్పుడు అంతర్జాతీయ సమాజ సహకారం అవసరం. ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె పేర్కొన్నారు.
మే 15 నాటికి తారస్థాయికి!
భారత్‌లో కరోనా రెండో ఉద్ధృతి వచ్చే నెల 11-15 మధ్య తారస్థాయికి చేరవచ్చని కాన్పుర్‌, హైదరాబాద్‌ ఐఐటీ శాస్త్రవేత్తలు రూపొందించిన గణిత నమూనా పేర్కొంది. ఆ సమయంలో దేశంలో క్రియాశీల కేసులు 33-35 లక్షలకు చేరొచ్చని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని