భారత్‌లో కొద్ది వారాల లాక్‌డౌన్‌ అవసరం

భారత్‌లో తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి తక్షణం కొద్ది వారాల పాటు లాక్‌డౌన్‌ విధించాలని

Updated : 02 May 2021 07:43 IST

ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఫౌచీ సూచన

దిల్లీ: భారత్‌లో తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి తక్షణం కొద్ది వారాల పాటు లాక్‌డౌన్‌ విధించాలని అమెరికాకు చెందిన ప్రఖ్యాత అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సూచించారు. బైడెన్‌ ప్రభుత్వ ముఖ్య వైద్య సలహాదారు అయిన ఆయన ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు. భారత్‌లో తగినంతగా ఆక్సిజన్‌ సరఫరా; మందులు, చికిత్సలు అందించడం; పీపీఈలు సమకూర్చడం వంటి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ‘‘ఒక విషయాన్ని గుర్తించాలి.. విజయాన్ని చాలా ముందుగానే ప్రకటించేశారు’’ అని ఏ ప్రభుత్వం పేరును ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యానించారు. వైరస్‌ను కట్టడి చేయడానికి తక్షణ, మధ్యమ, దీర్ఘకాలిక చర్యలు అవసరమంటూ గతంలో తాను చెప్పిన విషయాలను ఆయన గుర్తుచేశారు. ఏడాది క్రితం చైనాలో కరోనా వైరస్‌ విస్ఫోటనం చెందినప్పుడు వారు పూర్తిగా షట్‌డౌన్‌ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగని 6 నెలల పాటు విధించాల్సిన అవసరం లేదని.. వైరస్‌ సంక్రమణాన్ని నిరోధించడానికి తాత్కాలికంగా లాక్‌డౌన్‌ అవసరమని అన్నారు. ‘‘భారత్‌లో ఎంతోమంది ప్రజలు తమ కుటుంబ సభ్యులకు ఆక్సిజన్‌ అవసరమై వీధుల్లోకి తీసుకొస్తున్నట్లు విన్నాను. ఇలాంటి అవసరాల కోసం ఎలాంటి సంస్థ, కేంద్ర వ్యవస్థ లేదని వారు అనుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్‌ కీలకం..
కరోనాపై పోరులో వ్యాక్సినేషన్‌ కీలకపాత్ర పోషిస్తుందని ఫౌచీ నొక్కి చెప్పారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో 2 శాతం మందికి మాత్రమే టీకాలు వేశారంటే.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పరిపూర్ణం కావడానికి ఇంకా చాలా దూరం ఉందని అన్నారు. ‘‘ఇది పూర్తిస్థాయిలో జరగాలంటే తగినంత టీకాలు అందించాలి.. ప్రపంచంలోని మిగతా చోట్ల ఉన్న వివిధ కంపెనీలతోనూ ఇందుకు ఒప్పందాలు కుదుర్చుకోవాలి’’ అని సూచించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని