Oxygen: ప్రాణవాయువు డిమాండ్‌ తగ్గుముఖం

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో క్రమేపీ ఆక్సిజన్‌ డిమాండ్‌ తగ్గుతూ వస్తోంది. మే 9న 8,944 మెట్రిక్‌ టన్నుల మేర ఉన్న ఆక్సిజన్‌ సరఫరా తాజాగా 8,344 మె.టన్నులకు చేరినట్లు తెలుస్తోంది.

Updated : 24 May 2021 08:46 IST

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో క్రమేపీ ఆక్సిజన్‌ డిమాండ్‌ తగ్గుతూ వస్తోంది. మే 9న 8,944 మెట్రిక్‌ టన్నుల మేర ఉన్న ఆక్సిజన్‌ సరఫరా తాజాగా 8,344 మె.టన్నులకు చేరినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఇది తొలి ఉద్ధృతిలో సెప్టెంబరు 29న ఉపయోగించిన గరిష్ఠ పరిమాణం (3,095 మె.టన్నులు) కంటే 170% ఎక్కువే. మే 1న 7,603 మె.టన్నుల మేర ఉన్న సరఫరా ఆ తర్వాత వారం రోజులకు 8,920; మరో 3 రోజులకు 8,944 మె.టన్నులకు చేరింది. ఇంతవరకు ఒక్క రోజులో సరఫరా చేసిన గరిష్ఠ పరిమాణం ఇదే. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది మార్చి 31న కేవలం 1,559 మె.టన్నుల మేర మాత్రమే ఉన్న ద్రవీకృత ఆక్సిజన్‌ విక్రయాలు ఒక్క వారంలోనే విపరీతంగా పెరిగాయి. అయితే ఇప్పటికీ ఆసుపత్రులకు 8 వేల మె.టన్నుల వరకు రోజువారీ అవసరమవుతోంది. తాజా లెక్కల ప్రకారం దాదాపు 50 వేల మంది కొవిడ్‌ బాధితులు ఐసీయూల్లోను, 14,500 మంది వెంటిలేటర్ల మీద, 1.37 లక్షల మంది ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్నారు. తొలి ఉద్ధృతి గరిష్ఠస్థాయికి చేరిన సమయంలో ఐసీయూలో 23 వేల మంది, వెంటిలేటర్ల మీద 4 వేల మంది, ఆక్సిజన్‌తో 40 వేల మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 2-3రెట్లు ఎక్కువగా ఉంది. దానివల్లే ఇప్పటికీ రోజూ 8 వేల మె.టన్నుల వరకు ఆక్సిజన్‌ అవసరం అవుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని