కరోనా.. చైనా సృష్టే!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలే ల్యాబ్‌లో సృష్టించినట్లు బలం చేకూర్చే అధ్యయనం ఒకటి తాజాగా వెలువడింది.

Published : 31 May 2021 04:50 IST

 బ్రిటన్‌, నార్వే శాస్త్రవేత్తల తాజా అధ్యయనం

లండన్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలే ల్యాబ్‌లో సృష్టించినట్లు బలం చేకూర్చే అధ్యయనం ఒకటి తాజాగా వెలువడింది. పైగా అది గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు నమ్మించేందుకు ‘రివర్స్‌ ఇంజినీరింగ్‌’కు ప్రయత్నించినట్లు తెలిపారు. కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌కు ‘విశ్వసనీయమైన సహజసిద్ధ పూర్వరూపం’ ఏదీ లేదని చెప్పారు. కరోనా వైరస్‌ మూలాలు అంతుచిక్కకుండానే ఉన్నాయి. వీటిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చైనాలోని వుహాన్‌ నగరంలోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్‌ నుంచే ఇది లీకై ఉంటుందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కరోనా మొదటి కేసులు కూడా ఆ ల్యాబ్‌కు సమీపంలోని సీఫుడ్‌ మార్కెట్‌లో వెలుగు చూడటం ఇక్కడ గమనార్హం. ఈ నేపథ్యంలో మరోసారి వుహాన్‌ ల్యాబ్‌ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ మరో పరిశోధన వెలుగు చూసింది. సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలే కృత్రిమంగా సృష్టించారని బ్రిటిష్‌ ప్రొఫెసర్‌ అంగూస్‌ డాల్‌గ్లిష్‌, నార్వే శాస్త్రవేత్త బిర్గర్‌ సొరెన్‌సెన్‌ తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు బ్రిటన్‌ పత్రిక ‘డైలీ మెయిల్‌’లో ఒక కథనం వచ్చింది. పూర్తి నివేదిక మరికొన్ని రోజుల్లోనే సైంటిఫిక్‌ జర్నల్‌లో ప్రచురితం కానుంది. చైనాలోని గుహల్లో ఉండే గబ్బిలాల్లో ఉండే సహజసిద్ధ కరోనా వైరస్‌లోని ‘వెన్నెముక’ను సేకరించి, దానిలోకి కొత్త ‘స్పైక్‌’ను చొప్పించారని వీరు తెలిపారు. తద్వారా ఈ వైరస్‌ ప్రమాదకరంగా, తీవ్రంగా వ్యాపించేలా రూపాంతరం చెందిందన్నారు. దీన్ని ల్యాబ్‌లోనే సృష్టించారనడానికి కొవిడ్‌-19 నమూనాల్లో తాము ‘ప్రత్యేక సంకేతాల’ను గుర్తించామని కూడా చెప్పారు.

ఇవే నిదర్శనం..
కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు చేసిన పరిశోధనలో భాగంగా.. చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్‌ను జన్యుక్రమాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌పై ధనావేశం కలిగిన నాలుగు అమైనో ఆమ్లాలను వీరు ప్రముఖంగా ప్రస్తావించారు. దీనివల్ల మానవ శరీరంలోని రుణావేశ భాగాలకు  బలంగా అతుక్కోవడానికి ఇది వీలు కల్పిస్తోందని చెప్పారు. ఫలితంగా ఈ వైరస్‌ సాంక్రమిక శక్తి బాగా పెరిగిందని పేర్కొన్నారు. ఆ నాలుగు ధనావేశిత అమైనో ఆమ్లాలు విచిత్రంగా ఒకే వరుసలో ఉన్నాయన్నారు. కృత్రిమంగా తయారు చేస్తేనే ఇది సాధ్యమవుతుందని వాదిస్తున్నారు. మహమ్మారిని కలిగించే సహజసిద్ధ వైరస్‌ క్రమంగా ఉత్పరివర్తన చెంది, ఎక్కువగా సాంక్రమిక శక్తిని పొందుతుందని, అదే సమయంలో మానవుల్లో తీవ్ర వ్యాధిని కలిగించే సామర్థ్యాన్ని కోల్పోతుందని వీరు చెప్పారు. కరోనా విషయంలో అలా జరగడంలేదన్నారు. అది గబ్బిలాల నుంచి సహజసిద్ధంగా వ్యాపించిందని చెప్పడానికి చైనా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అయితే కొందరు మాత్రం దీనిపై తమకున్న అవగాహనను పంచుకునేందుకు సిద్ధపడ్డారని చెప్పారు. అయితే అలా చేయలేకపోవడం గానీ వారు అదృశ్యం కావడం గానీ జరిగిందన్నారు.
చైనా ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీకవ్వడం వల్లే కొవిడ్‌ మహమ్మారి ఉత్పన్నమై ఉంటుందన్న వాదనను విశ్వసించొచ్చని బ్రిటన్‌ నిఘా సంస్థలు తాజాగా వెల్లడించాయి. ఈ దిశగా ఆధారాలు ఉండొచ్చని తెలిపాయి. ఈ మేరకు ఆదివారం మీడియాలో కథనం వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని