శుక్రుడిపై శోధనకు రెండు వ్యోమనౌకలు

శుక్ర గ్రహంపై పరిశోధనల కోసం రెండు వ్యోమనౌకలను ప్రయోగించనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) తాజాగా ప్రకటించింది. ఈ దశాబ్దం చివర్లో వీటిని పంపుతామని తెలిపింది. భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఈ గ్రహం...

Updated : 04 Jun 2021 10:59 IST

ప్రయోగించేందుకు నాసా నిర్ణయం

వాషింగ్టన్‌: శుక్ర గ్రహంపై పరిశోధనల కోసం రెండు వ్యోమనౌకలను ప్రయోగించనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) తాజాగా ప్రకటించింది. ఈ దశాబ్దం చివర్లో వీటిని పంపుతామని తెలిపింది. భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఈ గ్రహం నిప్పుల కొలిమిలా మారడానికి దారితీసిన పరిస్థితులపై పరిశోధన సాగించడం వీటి ఉద్దేశం. ‘‘శుక్రుడి ఉపరితలంపై సీసం కూడా కరిగిపోయేలా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీనికి కారణాలను ఈ వ్యోమనౌకలు వెలుగులోకి తెస్తాయి. దాదాపు 30 ఏళ్లుగా ఆ గ్రహంపై మనం పరిశోధనలు సాగించలేదు. ఇప్పుడు అక్కడి పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలకు ఇదో అవకాశం’’ అని నాసా అధిపతి బిల్‌ నెల్సన్‌ పేర్కొన్నారు. ‘డిస్కవరీ’ కార్యక్రమం కింద నాసా ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీనికింద ఈ రెండు వ్యోమనౌకల కోసం 50 కోట్ల డాలర్లను కేటాయించింది. వీటికి ‘డీప్‌ అట్మాస్పియర్‌ వీనస్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫ్‌ నోబుల్‌ గ్యాసెస్‌, కెమిస్ట్రీ అండ్‌ ఇమేజింగ్‌’ (డావించి+), ‘వీనస్‌ ఎమిసివిటీ, రేడియో సైన్స్‌, ఇన్‌సార్‌, టోపోగ్రఫీ, స్పెక్ట్రోస్కొపీ’ (వెరిటాస్‌) అని పేర్లు పెట్టింది. శుక్ర గ్రహ వాతావరణంలోని మూలకాలపై మరిన్ని వివరాలను ‘డావించి+’ సేకరిస్తుంది. తద్వారా ఆ గ్రహ ఆవిర్భావం, పరిణామక్రమాన్ని తెలుసుకోవచ్చు. శుక్రుడిపై ఒకప్పుడు సాగరాలు ఉండేవా అన్నది కూడా ఈ వ్యోమనౌక శోధిస్తుంది. ‘వెరిటాస్‌’.. శుక్రుడి ఉపరితల మ్యాపింగ్‌ను చేపడుతుంది. అక్కడ అగ్నిపర్వతాలు ఉన్నాయా, భూకంపాలు చోటుచేసుకుంటున్నాయా అన్నది తేల్చేందుకు రాడార్‌ను ఉపయోగిస్తుంది. పరారుణ స్కానింగ్‌ ద్వారా అక్కడి శిలలను పరిశోధిస్తుంది. డావించి+, వెరిటాస్‌లను 2028-30లో ప్రయోగించే అవకాశం ఉంది. నాసా చివరిసారిగా 1990లో శుక్రుడి వద్దకు ‘మ్యాగెలాన్‌’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts