Mehul Choksi: చోక్సీకి బెయిల్‌ రాలేదు

వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ వేసిన బెయిల్‌ పిటిషన్‌ను డొమినికా మెజిస్ట్రేట్‌ కోర్టు తిరస్కరించింది. తీర్పు వెలువడిన కొద్దిసేపటికి.. పై కోర్టుకు వెళతామని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు.

Updated : 04 Jun 2021 09:52 IST

దిల్లీ: వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ వేసిన బెయిల్‌ పిటిషన్‌ను డొమినికా మెజిస్ట్రేట్‌ కోర్టు తిరస్కరించింది. తీర్పు వెలువడిన కొద్దిసేపటికి.. పై కోర్టుకు వెళతామని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. పీఎన్‌బీ కుంభకోణంలో రూ.13 వేల కోట్లు ఎగవేసి భారత్‌ నుంచి విదేశాలకు పరారైన చోక్సీ.. చక్రాల కుర్చీలో కోర్టు ముందు హాజరయ్యారు. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చోక్సీ పౌరసత్వం గురించి జరుగుతున్న విచారణ కాదని, దేశంలోకి అక్రమ ప్రవేశంపై దాఖలైన పిటిషన్‌ అని స్పష్టం చేసింది. మే 23న ఆంటిగ్వాలో అదృశ్యమైన చోక్సీ కొద్దిరోజులకు డొమినికాలో ప్రత్యక్షమయ్యారు. చోక్సీని ఎవరో అపహరించి డొమినికాకు తీసుకొచ్చారని ఆయన తరఫు న్యాయవాది వాదిస్తుండగా.. అక్రమంగానే ప్రవేశించారని అక్కడి పోలీసులు తేల్చి చెబుతున్నారు. చోక్సీ తరఫున డొమినికా హైకోర్టులో గురువారం దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషనుపై విచారణను జడ్జి వాయిదా వేశారు.
* వజ్రాల వ్యాపారి చోక్సీ మళ్లీ తమ దీవులకు రాకుండా డొమినికా నుంచి అటే నేరుగా భారత్‌కు పంపే అవకాశాలను పరిశీలించాలని ఆంటిగ్వా.. బార్బుడా కేబినెట్‌ సమావేశం తీర్మానించింది.  

భారత్‌కు రప్పిస్తాం : విదేశాంగశాఖ
దేశంలో ఆర్థికపరమైన నేరాలకు పాల్పడి, ఇక్కడి నుంచి పరారీలో ఉన్న అందరినీ మెహుల్‌ చోక్సీతో సహా వెనక్కి రప్పిస్తామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ గురువారం ఆన్‌లైన్‌ ద్వారా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం డొమినికా పోలీసుల కస్టడీలో ఉన్న చోక్సీని ఆ దేశంలోని కొన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయ్యాక భారత్‌కు తీసుకువస్తామని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని