సాగర గర్భం.. మరింత శక్తిమంతం!

సాగర గర్భంలో భారత నౌకాదళ పోరాట పటిమ మరింత శక్తిమంతం కానుంది. అధునాతన పరిజ్ఞానంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను దేశీయంగా నిర్మించేందుకు ఉద్దేశించిన మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం పచ్చజెండా ఊపింది.

Updated : 05 Jun 2021 08:05 IST

దేశంలో ఆరు అధునాతన జలాంతర్గాముల నిర్మాణం

దిల్లీ: సాగర గర్భంలో భారత నౌకాదళ పోరాట పటిమ మరింత శక్తిమంతం కానుంది. అధునాతన పరిజ్ఞానంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను దేశీయంగా నిర్మించేందుకు ఉద్దేశించిన మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం పచ్చజెండా ఊపింది. దీని విలువ రూ.43వేల కోట్లు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన ‘రక్షణ కొనుగోళ్ల మండలి’ (డీఏసీ) భేటీలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.    
‘వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా’ కింద ఈ జలాంతర్గాములను నిర్మిస్తారు. దేశీయ కంపెనీలు.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఉత్పత్తిదారులతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని భారత్‌లోనే అధునాతన ఆయుధ వ్యవస్థలను ఉత్పత్తి చేయడం ఈ నమూనా ఉద్దేశం.  తాజాగా డీఏసీ ఆమోదం తెలిపిన జలాంతర్గాముల ప్రాజెక్టును పి-75(ఇండియా)గా పేర్కొంటున్నారు. దీనికింద నిర్మించే ఆరు సబ్‌మెరైన్లకు అధునాతన ‘ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌’ వ్యవస్థ ఉంటుంది. అందువల్ల అవి ఎక్కువ సేపు నీటి అడుగున ఉండగలవు. శత్రువులకు ఆచూకీ దొరకని రీతిలో వీటిని స్టెల్త్‌ పరిజ్ఞానంతో రూపొందిస్తారు. ‘‘వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా కింద చేపట్టిన మొదటి ప్రాజెక్టు ఇదే. ‘భారత్‌లో తయారీ’ కింద చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఇదొకటి. సాంకేతిక పరిజ్ఞానాన్ని విదేశాల నుంచి వేగంగా బదిలీ చేయడానికి, దేశీయ కంపెనీలు దాన్ని త్వరగా గ్రహించడానికి ఇది వీలు కల్పిస్తుంది. భారత్‌లో జలాంతర్గాముల నిర్మాణానికి అంచలంచెలతో కూడిన పారిశ్రామిక మౌలిక వసతులను సృష్టించడానికి ఇది దోహదపడుతుంది’’ అని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి 12 ఏళ్లు పడుతుంది. ఈ జలాంతర్గాముల్లో అమర్చే ఆయుధ వ్యవస్థలను బట్టి అంతిమంగా ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం ఉంది. ఈ సబ్‌మెరైన్ల నిర్మాణం కోసం ప్రభుత్వ రంగంలోని మజ్గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌), ప్రైవేటు సంస్థ ఎల్‌ అండ్‌ టీలకు టెండర్లు జారీ చేసేందుకు డీఏసీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీలు.. ఇప్పటికే ఎంపిక చేసిన ఐదు విదేశీ నౌకానిర్మాణ సంస్థలు రోసోబోరాన్‌ఎక్స్‌పోర్ట్‌ (రష్యా), దేవూ (దక్షిణ కొరియా), టీకేఎంఎస్‌ (జర్మనీ), నవాంటియా (స్పెయిన్‌), నేవల్‌ గ్రూప్‌ (ఫ్రాన్స్‌)లలో ఒక్కో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. అనంతరం కాంట్రాక్టు కోసం బిడ్లు దాఖలు చేస్తాయి. వీటిని పరిశీలించి, ఒక కంపెనీని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది.
మొత్తంమీద 24 కొత్త జలాంతర్గాములను సమకూర్చుకోవాలన్నది నౌకాదళ ప్రణాళిక.  మరోవైపు వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా కింద విమానవాహక నౌకలపై మోహరించే 57 యుద్ధవిమానాలు, 111 నౌకాదళ వినియోగ హెలికాప్టర్లు, 123 బహుళ ప్రయోజన హెలికాప్టర్లను సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు భారత్‌లో సిద్ధమవుతున్నాయి.  తాజా డీఏసీ సమావేశంలో రూ.6,800 కోట్లతో సైన్యానికి గగనతల రక్షణ తుపాకులు, మందుగుండు సామగ్రి సహా పలు ఆయుధాల కొనుగోలుకూ ఆమోదం లభించింది. సైనిక బలగాలు చేపట్టే అత్యవసర ఆయుధ కొనుగోళ్లకు సంబంధించిన కాలావధిని ఈ ఏడాది ఆగస్టు 31 వరకూ పొడిగించేందుకూ సమ్మతి లభించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు