China: చైనాలో గజరాజుల మహా పాదయాత్ర!

అంతర్జాతీయ మీడియా దృష్టి ఇప్పుడు చైనాపై పడింది. అయితే అది కరోనా వైరస్‌ గురించి కాదు. అక్కడ ఓ ఏనుగుల గుంపు చేస్తున్న మహా పాదయాత్ర

Updated : 09 Jun 2021 07:56 IST

అడవిని వదిలి నగరాలను చుట్టేస్తున్న 15 ఏనుగులు
ఇప్పటికే 500 కి.మీ. దూరం ప్రయాణం

బీజింగ్‌: అంతర్జాతీయ మీడియా దృష్టి ఇప్పుడు చైనాపై పడింది. అయితే అది కరోనా వైరస్‌ గురించి కాదు. అక్కడ ఓ ఏనుగుల గుంపు చేస్తున్న మహా పాదయాత్ర గురించి. మరోవైపు యూట్యూబ్‌, ట్విటర్‌ల నిండా ఆ గజరాజులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. నెటిజన్లు వాటిని చూస్తూ అబ్బురపడుతున్నారు. సాధారణంగా ఏనుగులు అడవిలోని తమ ఆవాసాల నుంచి పెద్దగా బయటకు రావు. కానీ చైనాలోని ఓ ఏనుగుల గుంపు మాత్రం విచిత్రంగా అడవిని వదిలేసి నగరాల్లోకి వచ్చేసింది. ఏడాదికిపైగా అవి జనావాసాల్లోనే తిరుగాడుతున్నాయి. గుంపులోని 15 ఏనుగులు ఇప్పటికే 500 కి.మీ. దూరం ప్రయాణించాయి! అవి ఎందుకు ఇలా సుదీర్ఘంగా నడుచుకుంటూ వెళ్తున్నాయో ఇప్పటికీ అంతుపట్టడం లేదు. మార్గమధ్యంలో పంట పొలాలపై విరుచుకుపడుతుండటంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. దీంతోపాటు వాటి కదలికలతో నగరాల్లో ట్రాఫిక్‌ సహా అనేక సమస్యలు ఎదురవుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతేడాది యునాన్‌ ప్రావిన్స్‌లోని అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన ఈ ఏనుగులు ప్రస్తుతం కున్మింగ్‌ నగరానికి సమీపంలో ఉన్నాయి. అక్కడ ఇవి పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రయాణంపై నిఘా
ఏనుగుల గుంపు ప్రయాణాన్ని 410 మందితో కూడిన ప్రత్యేక బృందం.. నిత్యం గమనిస్తోంది. పెద్ద సంఖ్యలో వాహనాలు, 14 డ్రోన్ల సాయంతో వీరు ఏనుగుల గుంపు కదలికలపై నిఘా పెట్టారు. ఈ ఏనుగులు సుదీర్ఘ ప్రయాణం చేసేందుకు ప్రేరేపించిన కారణం మాత్రం ఇప్పటికీ తేలడం లేదు. మొక్కజొన్న సహా రుచికరమైన పంటలు, ఫలాలు కోసమే ప్రయాణిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గుంపునకు నేతృత్వం వహిస్తున్న ఏనుగుకు తగిన అనుభవం లేకపోవడం వల్ల ఇలా అడవులు విడిచి వచ్చినట్లు కూడా భావిస్తున్నారు. ఏనుగులు పంటలను ధ్వంసం చేయడం వల్ల ఇప్పటివరకూ 10 లక్షల డాలర్ల (సుమారు రూ.7.3 కోట్ల) నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని