Updated : 10 Jun 2021 07:16 IST

Joe Biden: దూరాలను చేరువ చేసేందుకు...

వారం రోజుల ఐరోపా యాత్రకు బైడెన్‌  
మిత్ర దేశాలకు భరోసా... చైనా, రష్యాలకు చెక్‌ పెట్టడమే లక్ష్యం  
పుతిన్‌తోనూ భేటీ

వాషింగ్టన్‌: ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో... పాశ్చాత్య దేశాలకు పెద్దన్నగా నిలిచి, పోషించిన పాత్రను పునః ప్రతిష్ఠించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రంగంలోకి దిగారు. తమ పాత మిత్ర దేశాలకు (నాటో, ఐరోపా) మేమున్నామని భరోసా ఇవ్వటం... తమను అన్నింటా సవాలు చేస్తున్న చైనా, రష్యాలకు పరోక్షంగా హెచ్చరిక పంపటం లక్ష్యంగా... బైడెన్‌ వారంరోజుల ఐరోపా యాత్రకు బుధవారం శ్రీకారం చుట్టారు. యూకేలో జరిగే జి-7 దేశాల సమావేశంలో పాల్గొనేందుకు బైడెన్‌ వాషింగ్టన్‌ నుంచి బయలుదేరారు. అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టాక బైడెన్‌ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే!

ఎందుకింత ప్రాధాన్యం?
ట్రంప్‌ హయాంలో ‘అమెరికా ఫస్ట్‌’ అంటూ తన సొంత ప్రాధాన్యాలకే అమెరికా పరిమితమైంది. చాలా దశాబ్దాలుగా తమను నమ్ముకొని, తన సారథ్యంలో నడుస్తున్న నాటో, ఐరోపా మిత్రదేశాలను పట్టించుకోవటం మానేసింది. ఫలితంగా చాలా దేశాలు అమెరికాను వదిలేసి... అయిష్టంగానైనా చైనా వైపు చూడటం మొదలెట్టాయి. అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల్లో అమెరికా సారథ్యానికిది ఇబ్బంది కలిగించే పరిణామం. గతంలో ఉపాధ్యక్ష హోదాలో ఈ దేశాలన్నింటితో సత్సంబంధాలు నెరపి, అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టిన అనుభవం బైడెన్‌కుంది. ఇప్పుడు అధ్యక్షుడిగా బైడెన్‌ మళ్లీ అమెరికా పెత్తనాన్ని ప్రతిష్ఠించే పనిలో పడ్డారు. వారం రోజుల పర్యటనలో పెద్దపెద్ద ఒప్పందాలేమీ ఉండబోవని... పాత మిత్రులకు మేమున్నామనే భరోసా కల్పించటం... తమకు పోటీగా వస్తున్న చైనాకు, చిరకాల శత్రువుగా పరిగణించే రష్యాకు అమెరికాను తక్కువగా అంచనా వేయొద్దనే సందేశం పంపటమే బైడెన్‌ ఈ పర్యటన ఉద్దేశమనేది విశ్లేషకుల మాట. ‘‘కరోనా మహమ్మారి విజృంభించి... ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో... కొత్త సవాళ్లను ఎదుర్కోవటంలో ప్రజాస్వామ్య దేశాల సత్తాను చాటడం ఈ పర్యటన ఉద్దేశం. అంతేగాకుండా... మా మిత్ర, భాగస్వామ్య దేశాలకు అమెరికా బాసటగా నిలుస్తుందని చాటి చెప్పటం ఈ పర్యటన లక్ష్యం!’’ అని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో బైడెన్‌ స్పష్టం చేశారు.

12 మంది దేశాధినేతలతో..
జి-7తో పాటు... నాటో, అమెరికా-యూరోపియన్‌ యూనియన్‌ సదస్సులు కూడా ఈ పర్యటనలో ఉన్నాయి. బైడెన్‌ దాదాపు 12 మంది దేశాధినేతలతో సమావేశం కానున్నారు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర దేశాల్లో ట్రంప్‌ సమయంలో తలెత్తిన భయాలను తొలగించటమే కాకుండా... అవసరాలు, కరోనా నేపథ్యంలో సాయంపై కూడా బైడెన్‌ సానుకూలంగా స్పందిస్తారు. పర్యటన చివర్లో జెనీవాలో బైడెన్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా శిఖరాగ్ర సమావేశం జరుపుతారు. ఇటీవల కొన్ని దేశాలపై రష్యా సేనల దాడి... అమెరికా కంపెనీలపై రష్యా హ్యాకర్ల దాడులు దీనిలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. వాతావరణ మార్పులు, అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, చైనా దూకుడు, కొవిడ్‌ టీకాలపై జి-7లో చర్చించే అవకాశముంది.

చైనాకు పోటీగా...
బైడెన్‌ పర్యటనలో మరో ప్రధాన అజెండా చైనా ప్రాబల్యాన్ని తగ్గించటం. ఇందుకోసం జి-7 దేశాల నేతలు... ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. చైనా ఆరంభించిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌కు పోటీగా ఈ కార్యక్రమం ఉంటుంది.

అమెరికా, ఐరోపాల బంధం బలంగా ఉందని... చైనా, రష్యాలకు స్పష్టం చేయటమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం! యావత్‌ ప్రపంచానికి కరోనా టీకాలపై నాకో ప్రణాళిక ఉంది. దాన్ని ఈ సమావేశంలో వెల్లడిస్తా.

- ఐరోపా పర్యటనకు బయల్దేరే ముందు విలేకరులతో బైడెన్‌

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని