
PM Modi: పనిమంతులకు పదవులు
కేంద్ర మంత్రివర్గంలో మార్పులపై ప్రధాని కసరత్తు
సీనియర్ మంత్రులు, భాజపా అధ్యక్షుడితో భేటీ
ఈనాడు, దిల్లీ: కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టి ఊపిరితీసుకునే సమయం చిక్కడంతో ప్రధాని మోదీ మంత్రివర్గ విస్తరణపై కసరత్తు ప్రారంభించారు. జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే మంత్రివర్గంలో మార్పులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. బాగా పనిచేస్తున్న వారికి ప్రోత్సాహం ఇవ్వడం, ఖాళీలను భర్తీ చేయడం, మిత్రపక్షాల ఆకాంక్షలను నెరవేర్చడం, ప్రాంతాల వారీగా సమతౌల్యాన్ని పాటించడం, రాజకీయ ప్రయోజనాలను కాపాడడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. మార్పులు చేర్పుల కోసం ఇప్పటికే ఆయన దాదాపు 30 మంది మంత్రుల పనితీరును మదింపు వేశారు. సోమవారం సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, డి.వి.సదానంద గౌడ, సహాయ మంత్రులు వి.మురళీధరన్, మరికొందరితో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఇందులో పాల్గొన్నారు. గత వారం హోం మంత్రి అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, జితేంద్ర సింగ్‌లతో సమావేశమయ్యారు. మొత్తం 79 మంత్రులను నియమించుకోవడానికి ఆయనకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 53 మందే ఉన్నారు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత ఇంతవరకు మార్పులు చేయలేదు. దాంతో మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతుందనేదానిపై ఆసక్తి నెలకొంది. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్కడి మిత్ర పక్షాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు ప్రాంతంలో ఓబీసీ అయిన పటేళ్లకు ప్రాబల్యం ఉండడంతో వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న అప్నా దళ్‌కు చెందిన అనుప్రియ పటేల్‌కు పదవి లభించవచ్చు. మొదటి మంత్రివర్గంలో ఆమె ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా పదవి ఇచ్చి ఎన్డీఏ పక్షాలను సంతృప్తి పరిచే ప్రయత్నాలు చేసే వీలుంది. బిహార్‌కు చెందిన జేడీ (యూ) ఒక కేబినెట్ పదవి, రెండు సహాయ మంత్రుల పదవులు ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండు చేస్తోంది. దాన్ని కూడా నెరవేర్చే సూచనలు ఉన్నాయి. శివసేన, అకాలీదళ్‌లు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లడంతో వాటికి గతంలో ఇచ్చిన మంత్రిపదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలోని పార్టీల్లో ఆర్పీఐకి చెందిన రాందాస్ అఠావలే (ఆర్పీఐ) ఒక్కరే మంత్రిమండలిలో ఉన్నారు. మిత్రపక్షాలను చిన్నచూపు చూస్తున్నారన్న అపప్రథను తొలగించాలని భావిస్తున్నారు. ఎల్జేపీ నాయకుడు రాం విలాస్ పాసవాన్ (బిహార్), రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి (కర్ణాటక)ల మరణం తరువాత వారి పదవులు భర్తీ కాలేదు. పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్, ప్రకాశ్ జావడేకర్, హర్దీప్ సింగ్ పురీ వంటి వారు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి వద్ద నుంచి అదనపు శాఖలు తొలగించి కొత్తవారిని నియమించే వీలుంది.
సమర్థతకు గుర్తింపు
బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీకి తగిన స్థానం లభించే సూచనలున్నాయి. ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా జీఎస్టీ మండలిలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం జీఎస్టీ మండలిలో ఎన్డీయేతర రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఆయన సేవలు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అండగా సహాయ మంత్రి పదవిలో నియమించే వీలుందని ఓ భాజపా నాయకుడు చెప్పారు. కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా, ఒడిశాకు చెందిన పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు జైజయంత్ పండా, అస్సాం మాజీ సీఎం సోనోవాల్‌లను మంత్రి పదవులు వరించే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.