Covaxin తుది ఉత్పత్తిలో దూడరక్తం లేదు: కేంద్రం

దేశీయంగా తయారైన కొవాగ్జిన్‌ టీకాలో ‘ఆవు దూడ రక్తపు రసి’ ఉందంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని, వాస్తవాలను వాటిలో వక్రీకరించారని......

Updated : 17 Jun 2021 09:09 IST

దిల్లీ: దేశీయంగా తయారైన కొవాగ్జిన్‌ టీకాలో ‘ఆవు దూడ రక్తపు రసి’ ఉందంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని, వాస్తవాలను వాటిలో వక్రీకరించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘అప్పుడే పుట్టిన దూడ రక్తపు రసిని.. వెరో సెల్స్‌ తయారీ, అభివృద్ధి కోసం మాత్రమే వాడతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా జరిగేదే. ఆవులు, లేదా ఇతర జంతువుల దూడల నుంచి దీనిని సేకరించి జీవ కణాలను వృద్ధి చేయడానికి ప్రామాణిక విధానం ఉంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఒకే రకమైన జీవ కణాలను సిద్ధం చేయడానికి వెరోసెల్స్‌ను వాడతారు. పోలియో, రేబిస్‌, ఇన్‌ఫ్లుయెంజా వంటివాటికి టీకాలను తయారు చేయడంలో ఈ పద్ధతిని గత కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు. వృద్ధి చెందిన తర్వాత వెరో సెల్స్‌ను నీటితో, రసాయనాలతో అనేకసార్లు శుభ్రపరుస్తారు. దూడ రక్తపు రసి ఏమాత్రం మిగలకుండా అలా చేస్తారు. ఆ తర్వాత వాటికి కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకేలా చేస్తారు. వైరస్‌ సంబంధిత వృద్ధి ప్రక్రియలో వెరో సెల్స్‌ను పూర్తిగా నాశనం చేస్తారు. ఆ తర్వాత.. వృద్ధి చెందిన వైరస్‌నూ నిర్వీర్యం చేసి శుద్ధి చేస్తారు. తుది వ్యాక్సిన్‌ తయారీలో దీనిని వాడతారు. ఈ తయారీలో దూడ రక్తపు రసిని వాడడమనేదే జరగదు. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌లో ఇది ఉండే అవకాశమే లేదు. దానిలో ఇది భాగమే కాదు’ అని విస్పష్టంగా తేల్చిచెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని