Ventilator అవసరం ముందే పసిగట్టే సాఫ్ట్‌వేర్‌

కొవిడ్‌-19 బాధితుల్లో వెంటిలేటర్, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ అవసరమయ్యేవారిని ముందుగానే గుర్తించేందుకు భారత్‌లో ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ సిద్ధమైంది. దీనికి ‘కొవిడ్‌

Updated : 20 Jun 2021 09:35 IST

దిల్లీ: కొవిడ్‌-19 బాధితుల్లో వెంటిలేటర్, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ అవసరమయ్యేవారిని ముందుగానే గుర్తించేందుకు భారత్‌లో ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ సిద్ధమైంది. దీనికి ‘కొవిడ్‌ సివ్యారిటీ స్కోర్‌’ అని నామకరణం చేశారు. ఆరోగ్యం విషమించకముందే బాధితులకు సకాలంలో చికిత్స అందించి, ప్రాణాలు కాపాడటానికి ఇది దోహదపడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఒక అల్గోరిథమ్‌ ఉంటుంది. ఇది బాధితుల్లో వ్యాధి లక్షణాలు, సంకేతాలు, కీలక పరామితులు, ఆరోగ్య పరీక్షల ఫలితాలు, ఇతరత్రా అనారోగ్యాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది. వాటిని విశ్లేషించి.. కొవిడ్‌ తీవ్రత స్కోరు (సీఎస్‌ఎస్‌)ను ఇస్తుంది. దీని ఆధారంగా వెంటిలేటర్‌ తోడ్పాటు, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్, ఇతరత్రా సేవలు అవసరమయ్యే వారిని ముందుగానే గుర్తిస్తుంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసేలా మార్గనిర్దేశం చేస్తుంది. అత్యవసర వైద్య సేవలు అవసరంలేని వారు ఆసుపత్రులకు రావడాన్ని ఇది తగ్గిస్తుంది. తద్వారా వైద్యశాలల్లో పడకల లభ్యతను పెంచుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని సైన్స్‌ ఫర్‌ ఈక్విటీ, ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలెప్‌మెంట్‌ (సీడ్‌) తోడ్పాటుతో కోల్‌కతాలోని ఫౌండేషన్‌ ఫర్‌ ఇన్నోవేషన్స్‌ ఇన్‌ హెల్త్‌ సంస్థ రూపొందించింది. దీన్ని కోల్‌కతాలోని మూడు కొవిడ్‌ సంరక్షక కేంద్రాల్లో ఉపయోగిస్తున్నారు. ‘సీడ్‌’ ప్రాజెక్టు కింద ప్రైమరీ కేర్‌ ఇ-హెల్త్‌ క్లినిక్‌లలో ఈ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్రం తెలిపింది. సీఎస్‌ఎస్‌ కోసం ట్యాబ్లెట్‌ కంప్యూటర్‌లో రోగి ఆరోగ్య వివరాలను నమోదు చేసేందుకు ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌ వర్కర్స్‌కు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని