
అమెరికాకు భారత్ గొప్ప భాగస్వామి
ఒక ప్రకటనలో శ్వేత సౌధం వెల్లడి
వాషింగ్టన్: ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా భారత్ తమకు గొప్ప భాగస్వామ్య దేశం అని అమెరికా తెలిపింది. ఆర్థికం, భద్రత, వ్యూహాత్మక వ్యవహారాలు వంటి అనేక కీలకమైన అంశాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నామని శ్వేతసౌధం మీడియా సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. కొవిడ్-19 రెండో దశ విజృంభణతో భారత్ పలు ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో అమెరికా అన్ని విధాలుగా సాయపడిందన్నారు. భవిష్యత్తులోనూ తమ సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మే లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. 100 మిలియన్ల డాలర్ల విలువ కలిగిన వైద్య పరికరాలు, సామగ్రి పంపించిన విషయాన్ని గుర్తుచేశారు.
డ్రీమర్లను కాపాడుకుందాం
అధ్యక్షుడు బైడెన్‌కు అమెరికా చట్టసభ సభ్యుల వినతి
వాషింగ్టన్: చట్టబద్ధ రక్షణలు లేని భారతీయ డ్రీమర్లును వారి దేశానికి తిప్పిపంపించకుండా అమెరికాలోనే ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వానికి ఆ దేశ చట్టసభల సభ్యులు విజ్ఞప్తి చేశారు. హెచ్1బి వీసాదారుల సంతానమైన వీరందరికీ వివిధ రంగాల్లో విశేష ప్రతిభా పాటవాలు ఉన్నాయని తెలిపారు. వారి తల్లిదండ్రులకు గ్రీన్ కార్డులు మంజూరు కాకపోవడంతో డ్రీమర్ల పౌరసత్వ అంశం అపరిష్కృతంగా ఉండిపోయిందని ప్రభుత్వానికి గుర్తు చేశారు. భారతీయ డ్రీమర్లు దాదాపు 2లక్షల మంది ఉంటారని అంచనా. దెబోరా రాస్, భారతీయ అమెరికన్ డాక్టర్ అమీబెరా నాయకత్వంలో 36 మంది చట్టసభల సభ్యులు ఈ మేరకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి లేఖ రాశారు. డ్రీమర్లకు భద్రత కల్పించడంతో పాటు చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.