త్రీగోర్జెస్‌ను తలదన్నేలా..!

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డ్యాం త్రీగోర్జెస్‌ను తలదన్నేలా మరో భారీ ఆనకట్టను, దానిపై పేద్ద జలవిద్యుత్‌ కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దవాటిలో రెండోదిగా పేర్కొనే బైహెతాన్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని ఆ దేశం సోమవారం పాక్షికంగా ఆరంభించింది.

Updated : 29 Jun 2021 05:49 IST

చైనాలో మరో భారీ జలవిద్యుత్‌ కేంద్రం పాక్షికారంభం

బీజింగ్‌: ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డ్యాం త్రీగోర్జెస్‌ను తలదన్నేలా మరో భారీ ఆనకట్టను, దానిపై పేద్ద జలవిద్యుత్‌ కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దవాటిలో రెండోదిగా పేర్కొనే బైహెతాన్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని ఆ దేశం సోమవారం పాక్షికంగా ఆరంభించింది. ఒకటో తేదీన చైనా కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈ రెండు యూనిట్లను ప్రారంభించారు! మొత్తం 16 యూనిట్లకుగాను మిగిలిన 14 యూనిట్లను 2022 జులై కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంకేతికంగా కూడా ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన జలవిద్యుత్‌ కేంద్రంగా చెబుతున్న ఈ ప్రాజెక్టును పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. 2017లో ఆరంభించిన డ్యామ్‌ కాంక్రీట్‌ పని ఈ మేలో పూర్తయింది. 80 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను ఉపయోగించారు.

ఎక్కడుంది?

చైనా నైరుతిలో ఉన్న సిచువాన్‌, యునాన్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో.. త్రీగోర్జెస్‌ డ్యాంను నిర్మిస్తున్న యాంగ్జే నది పైభాగంలో ఉండే జిన్షా నదిపై.. త్రీగోర్జెస్‌ తర్వాత ప్రపంచంలో అత్యంత భారీ జలవిద్యుత్‌ కేంద్రం ఇదే కాబోతోంది.

ఖర్చెంత?

సుమారు 3,400 కోట్ల డాలర్లు.

సామర్థ్యం ఎంత? 

1.6 కోట్ల కిలోవాట్ల వ్యవస్థాపక సామర్థ్యం. (త్రీగోర్జెస్‌ సామర్థ్యం 2.2 కోట్ల కిలోవాట్లు!) ఏటా ఇక్కడ 6,244 కోట్ల కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. (త్రీగోర్జెస్‌లో 8,820 కోట్ల కిలోవాట్లు).

ప్రపంచంలో ఇదే భారీది!

ఒక యూనిట్‌ సామర్థ్యం పరంగా చూస్తే మాత్రం బైహెతాన్‌ ప్రాజెక్టే ప్రపంచంలో అత్యంత భారీ ప్రాజెక్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక యూనిట్‌ సామర్థ్యం 10 లక్షల కిలోవాట్లు. త్రీగోర్జెస్‌లో ఒక యూనిట్‌ సామర్థ్యం 7 లక్షల కిలోవాట్లు మాత్రమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు