
Corona: నకిలీ వైరస్‌తో కరోనాకు అసలైన దెబ్బ
వాషింగ్టన్: మానవ శరీరాల్లోకి చొరబడి నక్క జిత్తులతో కణ యంత్రాంగాలను ఏమార్చి, ఇన్‌ఫెక్షన్‌ను కలుగజేస్తున్న కరోనా వైరస్‌ను అంతే యుక్తిగా బోల్తా కొట్టించే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవ్తేతలు కనుగొన్నారు. ఇందుకోసం లోపాలతో కూడిన కృత్రిమ కరోనా వైరస్‌ను తెరపైకి తెచ్చారు. ఇది అసలు వైరస్‌ను అంతం చేయడంతోపాటు తానూ అంతర్థానమవుతుంది. కరోనా వైరస్ మానవ కణ ఉపరితలానికి అతుక్కొని, ఆ తర్వాత తన జన్యు పదార్థాన్ని అందులోకి చొప్పిస్తుంది. అనంతరం వైరస్ కణ వ్యవస్థను హైజాక్ చేస్తుంది. ఈ క్రమంలో తనలాంటి అనేక ప్రతిరూపాలను సృష్టించుకుంటుంది. లోపభూయిష్టంగా తయారుచేసిన డిఫెక్టివ్ ఇంటర్‌ఫియరింగ్ (డీఐ) వైరస్‌లతో వీటికి చెక్ పెట్టొచ్చని పెన్సిల్వేనియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్ పునరుత్పత్తికి కావాల్సిన అనేకరకాల జన్యువులు వీటిలో ఉండవు. అయితే ఇవి ప్రవేశించిన కణాల్లో.. అసలైన వైరస్ ఉంటే డీఐ వైరస్ కూడా పునరుత్పత్తి చేయగలుగుతుంది. ఇందుకోసం అసలైన వైరస్ జన్యురాశిలోని పునరుత్పాదక యంత్రాంగాన్ని హైజాక్ చేస్తుంది. ఫలితంగా హానికర వైరస్ వృద్ధి కుంటుపడుతుంది. డీఐ జన్యురాశి చిన్నగా ఉండటం వల్ల అసలు వైరస్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుంది. హానికర వైరస్‌తో పోలిస్తే ఇది మూడు రెట్లు వేగంగా తన సంతతిని పెంచుకుంటుంది. ఫలితంగా 24 గంటల్లోనే అసలైన వైరస్‌కు సంబంధించిన లోడు సగం మేర తగ్గుతుంది.