అట్టుడుకుతున్న దక్షిణాఫ్రికా

కోర్టు ధిక్కరణ కేసులో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా జైలుకు వెళ్లడంతో దేశం అట్టుడుకుతోంది. ఆయన మద్దతుదారులు చెలరేగిపోతుండటంతో వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు, అల్లర్లు

Updated : 14 Jul 2021 10:20 IST

జాకబ్‌ జుమా జైలుకు వెళ్లడంతో చెలరేగిన హింస : 45 మంది మృతి

జొహెన్నెస్‌బర్గ్‌: కోర్టు ధిక్కరణ కేసులో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా జైలుకు వెళ్లడంతో దేశం అట్టుడుకుతోంది. ఆయన మద్దతుదారులు చెలరేగిపోతుండటంతో వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు, అల్లర్లు పెరిగాయి. కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనల్లో మృతిచెందిన వారి సంఖ్య మంగళవారం నాటికి 45కి పెరిగింది. గౌంటెంగ్‌, క్వాజులు-నటాల్‌ ప్రావిన్సుల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంది. అత్యధిక మరణాలు ఇక్కడే చోటుచేసుకున్నాయి. అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తుండగా.. సైన్యాన్ని కూడా రంగంలోకి దించారు. జొహెన్నెస్‌బర్గ్‌ టౌన్‌షిప్‌ సహా అనేక ప్రాంతాల్లో దుకాణాలు, వాణిజ్య సముదాయాలపై దాడి చేస్తున్న స్థానికులు అందినకాడికి దోచుకుపోతున్నారు. భద్రత దళాలు - ఆందోళనకారుల మధ్య ఘర్షణలతో వీధులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నేరశక్తులు పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకున్నట్లు గౌటెంగ్‌ ప్రావిన్స్‌ ప్రీమియర్‌ డేవిడ్‌ మఖురా అనుమానం వ్యక్తం చేశారు. ప్రావిన్స్‌ పరిధిలో 400 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదన్నారు. కొవిడ్‌ మహమ్మారి కంటే పరిస్థితి అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులు లూటీలను ఆపేలా చూడాలని రాజకీయ నాయకులు, మత, సామాజిక సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అల్లర్లను ఆపాలని జుమా మద్దతుదారులను అధికారులు కోరారు. కాగా జొహెన్నెస్‌బర్గ్‌లోని సంపన్న ప్రాంతాల్లో ఉన్న మాల్స్‌, రిటైల్‌ కేంద్రాలను మూసివేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, భద్రత సిబ్బంది సెలవులను రద్దు చేశారు. శాంతి, భద్రతల పరిరక్షణకు సైన్యానికి సర్వాధికారాలు అప్పగించినట్లు రమాఫోసా వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో హింస, దోపిడీలను ప్రతిపక్ష పార్టీలు, పౌర సంస్థలు ముక్త కంఠంతో ఖండించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు