Delhi HIgh Court: సీసీవోగా తాత్కాలిక ఉద్యోగిని నియమిస్తారా?

నిబంధనల ముఖ్య అమలు అధికారిగా (సీసీవో) తాత్కాలిక ఉద్యోగిని నియమించిన ట్విటర్‌ తీరుపై దిల్లీ హైకోర్టు బుధవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.

Updated : 29 Jul 2021 08:04 IST

ట్విటర్‌పై దిల్లీ హైకోర్టు అసంతృప్తి

దిల్లీ: నిబంధనల ముఖ్య అమలు అధికారిగా (సీసీవో) తాత్కాలిక ఉద్యోగిని నియమించిన ట్విటర్‌ తీరుపై దిల్లీ హైకోర్టు బుధవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ సామాజిక వేదిక కొత్త ఐటీ నిబంధనలను పాటించడం లేదని స్పష్టంచేసింది. సంస్థలో అత్యంత కీలకమైన నిర్వహణ అంశాలు చూసే ఉద్యోగి లేదా సీనియర్‌ ఉద్యోగిని సీసీవోగా నియమించడాన్ని నిబంధనలు తప్పనిసరి చేశాయని జస్టిస్‌ రేఖా పాటిల్‌ గుర్తుచేశారు. ట్విటర్‌ మాత్రం తన ప్రమాణపత్రంలో మూడోపక్ష గుత్తేదారు ద్వారా తాత్కాలిక ఉద్యోగిని నియమించినట్లు వెల్లడించిందని చెప్పారు. ‘‘ప్రమాణపత్రం ప్రకారం సీసీవో ఉద్యోగి కాదు. ఇది ప్రమాదకరం. నిబంధనల పట్ల కొంత స్పృహతో ఉండాలి. వాటిని గౌరవించాలి’’ అని తెలిపారు. ‘‘కొత్త ప్రమాణపత్రం దాఖలు చేయండి. ఇది ఆమోదయోగ్యం కాదు. మేం మీకు చాలా అవకాశాలు ఇచ్చాం. న్యాయస్థానం ప్రతిసారీ ఇలాగే చేస్తుందని భావించొద్దు. మూడోపక్ష గుత్తేదారు పేరు వెల్లడించండి. కంటింజెంట్‌ పదాన్ని వివరించండి’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. తాజాగా మరో ప్రమాణపత్రం దాఖలు చేయడానికి వారం రోజుల సమయం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని