చదువు పూర్తయ్యాక.. విదేశీ విద్యార్థులను అమెరికాలో ఉండనివ్వొద్దు

చదువు పూర్తయ్యాక కూడా విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తున్న ‘ఆపరేషనల్‌ ప్రాక్టీస్‌ ట్రెయినింగ్‌ (ఓపీటీ)’ కార్యక్రమాన్ని రద్దు చేసేందుకుగాను ప్రతినిధుల సభలో కొందరు చట్టసభ్యులు

Updated : 30 Jul 2021 08:52 IST

ప్రతినిధుల సభలో బిల్లు

వాషింగ్టన్‌: చదువు పూర్తయ్యాక కూడా విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తున్న ‘ఆపరేషనల్‌ ప్రాక్టీస్‌ ట్రెయినింగ్‌ (ఓపీటీ)’ కార్యక్రమాన్ని రద్దు చేసేందుకుగాను ప్రతినిధుల సభలో కొందరు చట్టసభ్యులు బిల్లు ప్రవేశపెట్టారు. ‘ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై-స్కిల్డ్‌ అమెరికన్స్‌ యాక్ట్‌’గా తాజా బిల్లును పిలుస్తున్నారు. ఇది చట్టరూపం దాలిస్తే.. అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్న వేల మంది భారతీయులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. హెచ్‌-1బీ వీసాలపై పరిమితి విధించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఓపీటీ తుంగలోకి తొక్కుతోందని చట్టసభ్యుడు పాల్‌ ఎ గోసర్‌ ఆరోపించారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక విదేశీ విద్యార్థులు మూడేళ్ల పాటు అమెరికాలో పనిచేసేందుకు ఈ కార్యక్రమం కొన్ని షరతులతో అనుమతిస్తోందని పేర్కొన్నారు. వారికి పేరోల్‌ పన్నుల నుంచి మినహాయింపు లభిస్తోందని, దీంతో అమెరికన్ల కంటే 10-15% తక్కువ వేతనాలకే అందుబాటులో ఉంటున్నారని వివరించారు. ఫలితంగా స్థానిక యువతకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతోందని చెప్పారు. ఓపీటీ రద్దు కోసం సహచర చట్టసభ్యులు మో బ్రూక్స్‌, ఆండీ బిగ్స్‌, మ్యాట్‌ గేట్జ్‌లతో కలిసి బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సెనేట్‌తో పాటు ప్రతినిధుల సభలోనూ డెమొక్రాట్లకే మెజార్టీ ఉన్న నేపథ్యంలో తాజా బిల్లు ఆమోదం పొందడం అంత సులభం కాదు. గోసర్‌ ఈ బిల్లును గతంలోనూ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని