ఆగస్టులో అమెరికాకు రెట్టింపు విమాన సర్వీసులు

అమెరికా వెళ్లే విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఎయిర్‌ ఇండియా తాజా ప్రకటన చేసింది. ఆగస్టు తొలి వారం నుంచి అమెరికాకు రాకపోకలు....

Published : 31 Jul 2021 04:59 IST

దిల్లీ: అమెరికా వెళ్లే విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఎయిర్‌ ఇండియా తాజా ప్రకటన చేసింది. ఆగస్టు తొలి వారం నుంచి అమెరికాకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించింది. ఉన్నత చదువుల కోసం వెళ్లేందుకు ఈమధ్య కాలంలో చాలామంది విద్యార్థులు సిద్ధం కాగా ఎయిర్‌ ఇండియా విమానాలను రీషెడ్యూల్‌ చేయడంతో వారంతా అసంతృప్తికి లోనయ్యారు. సామాజిక మాధ్యమాల వేదికగా దీన్ని వెలిబుచ్చిన నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా స్వాగతించదగ్గ ప్రకటన చేసింది. ‘‘ఇటీవల కొవిడ్‌ కేసులు పెరగడంతో భారత్‌ నుంచి విమానాల రాకపోకలను అమెరికా నియంత్రించింది. దీంతో చాలామేర ఆ దేశానికి మా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇలా రద్దయిన సర్వీసుల్లో ముంబయి-నెవార్క్‌ విమానం కూడా ఉంది. అందువల్ల మా పరిధిలో లేని కారణాల వల్ల ఈ విమాన సర్వీసుల రద్దు చేయాల్సి వచ్చింది’’ అని ‘ఎన్‌డీటీవీ’ అడిగిన ప్రశ్నకు ఎయిర్‌ ఇండియా వివరణ ఇచ్చింది. అమెరికా ఆంక్షలకు ముందు వారానికి దాదాపు 40 విమాన సర్వీసులు నడిపేవారమని.. జులైలో అమెరికాకు కేవలం 11 మాత్రమే నడపగలిగామని తెలిపింది. ఆగస్టు 7 నుంచి ఈ సంఖ్యను 22కి పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో వీలయినంత ఎక్కువ మందికి ప్రయాణానికి వీలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ముంబయి-నెవార్క్‌ల మధ్య ఆగస్టు 6, 13, 20, 27 తేదీల్లో అదనపు సర్వీసులను కూడా నడుపుతున్నట్లు ఎయిర్‌ ఇండియా ట్వీట్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు