సాగర భద్రతకు పంచసూత్రాలు

మహాసముద్రాలను యావత్‌ ప్రపంచ వారసత్వ సంపదగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. సాగర భద్రత విషయంలో దేశాల మధ్య పరస్పర సహకారం పెరగాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఇందుకోసం ఐదు సూత్రాలను ప్రతిపాదించారు. ‘సముద్ర భద్రత పెంపు - అంతర్జాతీయ సహకార ఆవశ్యకత’ అనే అంశంపై ఐరాస భద్రత మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చకు మోదీ అధ్యక్షత వహించారు.

Published : 10 Aug 2021 05:09 IST

ఐరాస భద్రత మండలి చర్చలో ప్రతిపాదించిన మోదీ

ఐరాస: మహాసముద్రాలను యావత్‌ ప్రపంచ వారసత్వ సంపదగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. సాగర భద్రత విషయంలో దేశాల మధ్య పరస్పర సహకారం పెరగాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఇందుకోసం ఐదు సూత్రాలను ప్రతిపాదించారు. ‘సముద్ర భద్రత పెంపు - అంతర్జాతీయ సహకార ఆవశ్యకత’ అనే అంశంపై ఐరాస భద్రత మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చకు మోదీ అధ్యక్షత వహించారు. యూఎన్‌ఎస్‌సీలో ఓ బహిరంగ చర్చకు భారత ప్రధానమంత్రి అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి అని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది.

ఉగ్రవాదం, దోపిడీల కోసం సముద్ర మార్గాలు దుర్వినియోగమవుతున్నాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. తీరరేఖను కలిగిఉన్న దేశాలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వాటిని దీటుగా ఎదుర్కొనే సమగ్ర అంతర్జాతీయ ప్రణాళికను రూపొందించుకునేందుకు ఐదు సూత్రాలను ప్రతిపాదించారు. యూఎన్‌ఎస్‌సీ ప్రత్యేకంగా సముద్ర భద్రతపై అత్యున్నత స్థాయిలో బహిరంగ చర్చను చేపట్టడం ఇదే తొలిసారి.

మోదీ ప్రతిపాదించిన ఐదు సూత్రాలను తాజా చర్చలో పాల్గొన్నవారంతా స్వాగతించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

ఆ అయిదు ఏమిటంటే..

1. చట్టబద్ధమైన సముద్ర వాణిజ్యానికి అడ్డంకులను తొలగించాలి. సాగర మార్గాల్లో వాణిజ్యపు క్రియాశీలతపై అంతర్జాతీయ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. దానికి ఎదురయ్యే ఆటంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తాయి.
2. సముద్ర సంబంధిత వివాదాలను అంతర్జాతీయ చట్టాలకు లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. పరస్పరం విశ్వాసాన్ని పెంపొందించుకోవడంలో ఇది చాలా ముఖ్యం. అంతర్జాతీయ శాంతి, స్థిరత్వాల సాధనకు ఏకైక మార్గమిది. (దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం విషయాల్లో చైనాకు వివిధ దేశాలతో వివాదాలున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి)
3. ప్రకృతి విపత్తులను, ప్రభుత్వేతర శక్తుల వల్ల తలెత్తే ముప్పులను అంతర్జాతీయ సమాజం ఐక్యంగా ఎదుర్కోవాలి. ఈ విషయంలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించేందుకు భారత్‌ ఇప్పటికే ‘సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ ది రీజియన్‌ (సాగర్‌)’ వంటి కార్యక్రమాల ద్వారా అనేక చర్యలు చేపట్టింది.
4. సముద్ర పర్యావరణం, వనరులను పరిరక్షించాలి. పర్యావరణంపై మహాసముద్రాలు నేరుగా ప్రభావం చూపుతాయి. సాగరాల్లో చమురు లీకేజీలు, ప్లాస్టిక్‌ వ్యర్థాల వంటి కాలుష్య కారకాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
5. సాగర జలాల్లో బాధ్యతాయుత అనుసంధానతను ప్రోత్సహించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు