అఫ్గాన్‌లో ఆగని తాలిబన్ల దురాక్రమణ

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతూనే ఉంది. దేశ రాజధాని కాబుల్‌కు సమీపంలోని ఘాజ్నీ నగరాన్ని గురువారం వారు హస్తగతం చేసుకున్నారు. దీంతో మొత్తం పది రాష్ట్రాల రాజధానులు

Published : 13 Aug 2021 05:06 IST

వారి గుప్పిట్లోకి పదో రాష్ట్ర రాజధాని 

బలహీనపడుతున్న ప్రభుత్వ సైన్యం

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతూనే ఉంది. దేశ రాజధాని కాబుల్‌కు సమీపంలోని ఘాజ్నీ నగరాన్ని గురువారం వారు హస్తగతం చేసుకున్నారు. దీంతో మొత్తం పది రాష్ట్రాల రాజధానులు వారి చెరలోకి వెళ్లినట్టయింది. ఘాజ్నీని కోల్పోవడం అఫ్గాన్‌ సేనలకు వ్యూహాత్మకంగా గట్టి ఎదురుదెబ్బే! కాబుల్‌-కాందహార్‌ హైవేలో ఉన్న ఈ నగరం... దేశ రాజధానిని, దక్షిణాది రాష్ట్రాలనూ కలుపుతుంది. ఘాజ్నీ తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో అఫ్గాన్‌ సైనికుల రవాణా కష్టతరమవుతుంది. మరోవైపు దక్షిణాది ప్రాంతాలపై పట్టు సాధించడం తాలిబన్లకు సులభమవుతుంది. హెల్మాండ్‌ ప్రావిన్స్‌లోని లష్కర్‌ గాహ్‌ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ భవనం వెలుపల సైనికులు మోహరించారు. నెల రోజుల్లో కాబుల్‌పై తాలిబన్ల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురుకానుందని... పరిస్థితే ఇలాగే కొనసాగితే కొన్ని నెలల్లోనే అఫ్గాన్‌పై తాలిబన్లు పూర్తిపట్టు సాధిస్తారని అమెరికా సైనిక నిఘా అధికారులు అంచనా వేశారు. దీంతో కాబుల్‌ సహా మరికొన్ని నగరాలను కాపాడుకునేందుకే అక్కడ ప్రభుత్వం పరిమితం కావచ్చని విశ్లేషించారు. తాజా పరిణామాల క్రమంలో అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ... సైన్యాధిపతి జనరల్‌ వలీ అహ్మదాజీని తొలగించారు. ఆయన స్థానంలో జనరల్‌ హిబతుల్లా అలీజాయిని నియమించారు.

భారత్‌ అందించిన హెలికాప్టర్‌ స్వాధీనం

అఫ్గానిస్థాన్‌కు భారత్‌ అందించిన ఎం-35 హెలికాప్టర్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కుందుజ్‌ ఎయిర్‌బేస్‌లో దీన్ని ఉంచి, చాపర్‌ రెక్కలను తొలగించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అఫ్గాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ బలోపేతానికి భారత్‌ మొత్తం నాలుగు హెలికాఫ్టర్లను బహుమతిగా అందించింది. తాజా పరిణామంపై స్పందించేందుకు భారత రక్షణశాఖ నిరాకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు