భారత పౌరులను సురక్షితంగా తీసుకురండి: మోదీ

అఫ్గానిస్థాన్‌లో చిక్కుకొన్న భారతీయ పౌరులందరినీ సురక్షితంగా వెనక్కు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పొరుగు దేశం అఫ్గానిస్థాన్‌లో  నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితులపై...

Updated : 18 Aug 2021 05:53 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లో చిక్కుకొన్న భారతీయ పౌరులందరినీ సురక్షితంగా వెనక్కు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పొరుగు దేశం అఫ్గానిస్థాన్‌లో  నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మంగళవారం అత్యున్నతస్థాయి భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా సహా జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ డోభాల్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. భేటీలో అఫ్గాన్‌ పరిణామాలు, అనంతరం తలెత్తిన పరిస్థితులపై ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్షించారు. అక్కడి నుంచి భారత్‌కు రావాలని చూస్తున్న సిక్కులు, హిందువులకు ఆశ్రయం కల్పించాలని సూచించారు. సాయం కోసం మనవైపు చూస్తున్న అఫ్గాన్‌ సోదర సోదరీమణులను సైతం వీలైనంతమమేర ఆదుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. 

* అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారం హస్తగతం చేసుకున్న నేపథ్యంలో క్షీణించిన భద్రత కారణాల రీత్యా కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేశారు. వైమానిక దళానికి చెందిన రవాణా విమానం (సి-17 హెవీ- లిఫ్ట్‌)లో భారత్‌ వీరిని వెనక్కు రప్పించింది. ఈ విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఎయిర్‌ బేస్‌లో మంగళవారం ఉదయం 11.15 గంటలకు దిగింది. ఇక్కడ వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంధనం నింపుకొన్నాక  విమానం దిల్లీకి బయలుదేరింది. ఈ సందర్భంగా అఫ్గానిస్థాన్‌లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాబుల్‌లో పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, వాణిజ్య విమాన సర్వీసులను పునరుద్ధరించగానే నగరంలో చిక్కుపోయిన భారతీయులను వెనక్కు రప్పిస్తామన్నారు. తాము మొత్తం 192 మంది సురక్షితంగా స్వదేశం చేరినందుకు సంతోషంగా ఉన్నా..  అఫ్గాన్‌ సంక్షేమం కూడా తమకు ముఖ్యమని తెలిపారు. వీరి బృందంలో 99 మంది ఐటీబీపీ కమాండోలు, నలుగురు జర్నలిస్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కమాండోల వెంట మూడు జాగిలాలు కూడా భారత్‌ చేరుకున్నాయి. విమానం ఇక్కడికి రాగానే ప్రయాణికులకు కొందరు పూలమాలలు వేశారు. ‘భారత్‌ మాతా కీ జై’ అనే నినాదాలు మిన్నంటాయి. సోమవారం 40 మందితో కూడిన ఓ బృందం ఇప్పటికే భారత్‌ చేరుకున్న విషయం తెలిసిందే. 1996లో తాలిబన్లు మొదటిసారి అధికారం చేపట్టినపుడు కూడా భారత్‌ ఇలాగే రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసింది. ‘అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. విమానాలు నిలిపివేసి, గగనతలం కూడా జామ్‌ చేశారు. అయినా అక్కడ చిక్కుకొన్న చివరి భారతీయుడి వరకు అందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకువస్తాం’ అని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాకు తెలిపారు.


ఎమర్జెన్సీ ఈ-వీసాలు.. ఐఐటీ హెల్ప్‌లైన్లు

ఫ్గాన్‌.. తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కొత్త కేటగిరీ వీసాలను భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. భారత్‌కు రావాలనుకునే అఫ్గానీల ఆన్‌లైన్‌ దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఎమర్జెన్సీ ఎలక్టాన్రిక్‌ వీసా విధానాన్ని తీసుకొచ్చారు. అఫ్గాన్‌ నుంచి వచ్చి ఇక్కడ చదువుకొంటున్న తమ విద్యార్థులను క్షేమంగా భారత్‌కు రప్పించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దేశంలోని పలు ఐఐటీ విద్యాసంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.


సంక్షోభంపై భారత్‌, అమెరికా చర్చలు

కాబుల్‌లో విమాన కార్యకలాపాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం న్యూయార్క్‌కు చేరుకున్న జైశంకర్‌.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ఫోనులో మాట్లాడారు. అఫ్గాన్‌లో పరిస్థితిపై ఇరువురూ చర్చించారు. ‘భారత్‌కు తిరిగి రావాలనుకొంటున్న వారి ఆందోళన అర్థం చేసుకోగలం. ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటం వల్ల సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనిపై చర్చలు జరుపుతున్నా’మని ట్వీట్‌ చేశారు. ప్రజలకు సమాచారం కోసం స్పెషల్‌ అఫ్గనిస్థాన్‌ సెల్‌ను తమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసినట్లు జైశంకర్‌ తెలిపారు.

ఫోన్‌ నంబర్లు : +91-11-49016783, +91-11-49016784, +91-11-49016785.

వాట్సప్‌ : +918010611290.

ఈమెయిల్‌ : SituationRoom@mea.gov.in అఫ్గాన్‌లోని చాలామంది భారతీయులు ఎంబసీల్లో పేర్లు నమోదు చేసుకోకపోవడంతో వీరి సంఖ్యపై స్పష్టత లేదు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు