ఏదో ఒకచోటే రిజర్వేషన్‌ ప్రయోజనాలు

రిజర్వుడు వర్గానికి చెందిన అభ్యర్థులు రెండు రాష్ట్రాల్లోనూ ఆ సౌకర్యాన్ని పొందలేరని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అవిభక్త రాష్ట్రంలో రిజర్వేషన్‌ సౌకర్యం పొందిన వారు రాష్ట్ర విభజన తరువాత ఏ రాష్ట్రంలోనయినా ఈ ప్రయోజనం...

Published : 21 Aug 2021 05:43 IST

రాష్ట్ర విభజన అనంతర పరిస్థితులపై సుప్రీంకోర్టు తీర్పు

దిల్లీ: రిజర్వుడు వర్గానికి చెందిన అభ్యర్థులు రెండు రాష్ట్రాల్లోనూ ఆ సౌకర్యాన్ని పొందలేరని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అవిభక్త రాష్ట్రంలో రిజర్వేషన్‌ సౌకర్యం పొందిన వారు రాష్ట్ర విభజన తరువాత ఏ రాష్ట్రంలోనయినా ఈ ప్రయోజనం పొందడానికి అర్హులని తెలిపింది. అయితే ఒకే సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని పొందలేరని వివరణ ఇచ్చింది. బిహార్‌ 2000 నవంబరులో రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఉమ్మడి బిహార్‌లో ఎస్‌.టి.రిజర్వేషన్‌ పొందిన వారు ఝార్ఖండ్‌లో ఆ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. మళ్లీ బిహార్‌లో దాన్ని ఉపయోగించుకోలేరని, అక్కడ ఉద్యోగాల కోసం పోటీ పడాలంటే జనరల్‌ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టత ఇచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఝార్ఖండ్‌కు చెందిన పంకజ్‌ కుమార్‌ 2007లో జరిగిన రాష్ట్ర సివిల్‌ సర్వీసు పరీక్షల్లో ఉత్తీర్ణులయినప్పటికీ శాశ్వత నివాసం పట్నాలో ఉండడంతో ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. శాశ్వత నివాసం పట్నా అయినప్పటికీ, తన తండ్రి ఉద్యోగం, తన విద్యాభ్యాసం అంతా ఝార్ఖండ్‌లోనే జరిగిందని చెప్పినా దాన్ని అంగీకరించలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా 2:1 మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీన్ని మళ్లీ ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని వివిధ అంశాలను పరిశీలించిన ధర్మాసనం రాష్ట్రం విడిపోయినప్పుడు ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రయోజనాలు పొందడానికి అర్హత సాధిస్తారని స్పష్టం చేసింది. ఆయనకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు, ఇంతవరకు రావాల్సిన ప్రయోజనాలు అన్నింటినీ కల్పించాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని