మారుతున్న యువతే దేశానికి బలం

యువత ఆలోచన ధోరణి మారుతోందని, ఇది దేశానికి నూతన శక్తి కానుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ యువతలో వస్తున్న మార్పులు, అందుకు కల్పించాల్సిన...

Published : 30 Aug 2021 04:50 IST

నవీన ఆవిష్కరణల దిశగా వారి ఆలోచనలు
ఉజ్వల భవితకు ఇదే సూచిక
‘మన్‌ కీ’ బాత్‌లో ప్రధాని మోదీ 

దిల్లీ: యువత ఆలోచన ధోరణి మారుతోందని, ఇది దేశానికి నూతన శక్తి కానుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ యువతలో వస్తున్న మార్పులు, అందుకు కల్పించాల్సిన వసతుల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘యువత ఆలోచన విధానాల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. వారు నవీన మార్గాలను అన్వేషిస్తున్నారు. నూతన లక్ష్యాలను పెట్టుకుంటున్నారు. కొత్త ఆశలతో ముందుకు వెళ్తున్నారు. కుటుంబ సంప్రదాయాలను కాదని కొత్త ఉపాధి అవకాశాలను వెతుక్కుంటున్నారు. సాహసాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఏదో అలా జరిగిపోనీ అన్న ధోరణిలో కాకుండా ప్రాశస్త్యం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు’’ అని చెప్పారు. అందుకే దేశంలో ‘అంకుర సంస్థల సంస్కృతి’ చాలా వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. చిన్న పట్టణాల్లో సైతం యువత నూతన ఆవిష్కరణలతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. దేశ ఉజ్వల భవితకు ఇది సూచిక అని ప్రశంసించారు. అంతరిక్ష రంగంలో సంస్కరణలు చేపట్టినప్పుడు కూడా యువత ముందుకు వచ్చారని చెప్పారు.

గ్రామాల్లోనూ ఆటలపోటీలు
ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జాతీయ క్రీడల దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఈ సందర్భంగా యువత పాత్రను ప్రస్తావిస్తూ ‘‘వారు కేవలం ఆటలను చూసే ప్రేక్షకులుగా ఉండాలని అనుకోవడం లేదు. క్రీడల్లో ఉన్న అవకాశాలను వెతుక్కుంటున్నారు. క్రీడాకారులుగా రాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహిస్తున్నారు. క్రీడా సంస్కృతి విస్తరిస్తున్నందున గ్రామాల్లోనూ పోటీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో సహకరించాలి. ‘సబ్‌ కా ప్రయాస్‌’ అన్న నినాదాన్ని ఆచరణలోకి పెట్టాలి’’ అని కోరారు.

సోమవారం జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. స్వచ్ఛభారత్‌ అమలును కూడా ప్రధాని తన ప్రసంగంలో గుర్తు చేశారు. మురికినీటిని శుభ్రం చేయడంలో ఇండోర్‌ నగరం ఆదర్శంగా ఉందని ప్రశంసించారు. ఇక్కడ డ్రైనేజీ నీటిని శుభ్రం చేయకుండా నేరుగా నదుల్లోకి విడిచిపెట్టడం లేదని, అందువల్ల ఇది ‘వాటర్‌ ప్లస్‌ సిటీ’గా గుర్తింపు పొందిందని చెప్పారు. కూరగాయల వ్యర్థాలతో విద్యుత్తు తయారు చేస్తున్న తమిళనాడులోని శివగంగై జిల్లా కాంజీరంగాల్‌ గ్రామస్థులను అభినందించారు.


కరోనాతో జాగ్రత్త

రోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ మరోసారి హితవు చెప్పారు. ‘‘ఇప్పటికే 62 కోట్ల డోసుల టీకాలు వేశాం. అయినా జాగ్రత్తగా ఉండాలి’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని