Delhi Rains: దిల్లీలో వాన.. 19 ఏళ్లలో సరికొత్త రికార్డు

దేశరాజధాని దిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ ఎడతెగని కుంభవృష్టి కురిసింది.

Updated : 02 Sep 2021 08:15 IST

దిల్లీ: దేశరాజధాని దిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ ఎడతెగని కుంభవృష్టి కురిసింది. 24 గంటల్లోనే 112.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. గత 19 ఏళ్లలో సెప్టెంబరుకు సంబంధించి ఒక్కరోజులో దిల్లీలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే కావడం విశేషం. అంతకన్నా ముందు 2002 సెప్టెంబరు 13న అక్కడ 126.8 మి.మీ. వర్షం కురిసింది. 1963 సెప్టెంబరు 16న కురిసిన 172.6 మి.మీ. వర్షపాతమే ఇప్పటివరకూ గరిష్ఠం. బుధవారం ఉదయం నుంచి మొదటి 3 గంటలలోనే 75.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో సెప్టెంబరు నెల సగటు వర్షపాతాన్ని తొలి రెండు రోజుల్లోనే అధిగమించడం గమనార్హం. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గణాంకాల ప్రకారం దిల్లీలో సెప్టెంబరులో సగటున 125.1 మి.మీ. వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. తాజాగా కురుస్తున్న వర్షాలతో దిల్లీ రహదారులు జలమయమయ్యాయి. మోకాలి లోతుతో నీళ్లు ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ నెలలో వర్షాలు సాధారణ స్థాయి కన్నా కాస్త అధికంగా కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని