Compensation: ‘తప్పుడు హెయిర్‌కట్‌.. ఆ మోడల్‌కు రూ.2 కోట్లు చెల్లించండి’

మహిళకు తప్పుడు క్షవరం (హెయిర్‌ కట్‌) చేయడంతోపాటు ఆమె కేశాలకు తప్పుడు చికిత్స చేసినందుకు రూ.2 కోట్లు పరిహారంగా చెల్లించాలంటూ దిల్లీలోని విలాసవంతమైన

Published : 24 Sep 2021 07:58 IST

హోటల్‌ను ఆదేశించిన ఎన్‌సీడీఆర్‌సీ

దిల్లీ: మహిళకు తప్పుడు క్షవరం (హెయిర్‌ కట్‌) చేయడంతోపాటు ఆమె కేశాలకు తప్పుడు చికిత్స చేసినందుకు రూ.2 కోట్లు పరిహారంగా చెల్లించాలంటూ దిల్లీలోని విలాసవంతమైన హోటల్‌కు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ) ఆదేశాలు జారీచేసింది. మోడలింగ్‌లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలన్న ఆమె కల హోటల్‌ సిబ్బంది పొరపాటు కారణంగా సర్వనాశనం అయిందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎన్‌సీడీఆర్‌సీ అధ్యక్షుడు ఆర్‌.కె.అగర్వాల్‌, సభ్యుడు ఎస్‌ఎం కాంతికార్‌ ఆదేశాలు జారీచేశారు. మహిళలకు కేశ సంపదతో భావోద్వేగపరమైన అనుబంధం ఉంటుందని, వాటిని సంరక్షించుకునేందుకు, మంచి స్థితిలో ఉంచుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, శక్తికొద్దీ ఖర్చు చేస్తారని వ్యాఖ్యానించారు. ఫిర్యాదుదారైన అషనా రాయ్‌ తనకున్న పొడవైన కేశాల కారణంగా పలు కేశ సంరక్షణ ఉత్పత్తులకు మోడల్‌గా వ్యవహరించారని, అనేక పెద్ద బ్రాండ్‌లకూ పనిచేశారని కమిషన్‌ పేర్కొంది. సూచనలకు విరుద్ధంగా క్షవరం చేయడం వల్ల అవకాశాలు దూరమయ్యాయని, ఆమె జీవితమే మారిపోయిందని, అత్యున్నత మోడల్‌ కావాలన్న అషనా కల నాశనమైందని ఈ నెల 21న జారీచేసిన ఉత్తర్వులో కమిషన్‌ స్పష్టంచేసింది. సిబ్బంది పొరపాటు కారణంగా ఆమె నెత్తి కాలిపోయిందని, ఇప్పటికీ దురద, అలెర్జీతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించింది. ఫిర్యాదురాలి వాట్సప్‌ చాట్‌ను పరిశీలించగా.. హోటల్‌ యాజమాన్యం తన తప్పును అంగీకరించడంతోపాటు దిద్దుబాటు చర్యలు చేపడతామని అంగీకరించిందని ఎన్‌సీడీఆర్‌సీ చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని