Published : 30/09/2021 04:38 IST

న్యాయస్థానాల ప్రతిష్ఠ కోసమే కోర్టు ధిక్కరణలకు శిక్ష

 64 పిల్‌లు వేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: న్యాయ స్థానాల ప్రతిష్ఠను కాపాడడానికే వాటికి ‘కోర్టు ధిక్కరణలకు శిక్షించే’ అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టిందని బుధవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇదేమీ కక్ష తీర్చుకోవడానికి ఉద్దేశించింది కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయస్థానాలకు ఉన్న అధికారాలను ఎవరూ తీసుకోలేరని తెలిపింది. చట్టసభల్లో శాసనాలు ద్వారా కూడా దీన్ని హరించలేరని స్పష్టం చేసింది. కోర్టుపై బురద జల్లడంతో పాటు బెదిరించినందుకు విధించిన రూ.25 లక్షల జరిమానాను చెల్లించని సూరజ్‌ ఇండియా ట్రస్టు ఛైర్మన్‌ రాజీవ్‌ దైయాను ఉద్దేశించి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎవరో ఒకరు తగని వ్యాఖ్యలు చేసినంత మాత్రాన జడ్జి ప్రతిష్ఠ ఏమీ తగ్గిపోదు. కానీ తన ఉనికిని నిరూపించుకోవడానికి అందరిపై విమర్శలు చేస్తూ నిరంతరం వ్యాజ్యాలు వేస్తూ పోతుంటే కోర్టు జోక్యం చేసుకోవాల్సిందే’’నని తెలిపింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారిని శిక్షించడం రాజ్యాంగం కల్పించిన అధికారం అని తెలిపింది. విధించిన శిక్షను వినడానికి వచ్చే నెల ఏడో తేదీన కోర్టుకు హాజరు కావాలని రాజీవ్‌ను ఆదేశించింది. ఏడాదిలో 64 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టును దూషించినందుకు 2017లో ఆయనకు న్యాయస్థానం రూ.25 లక్షల జరిమానా విధించింది.  జరిమానా కట్టడానికి తన వద్ద సొమ్ము లేదని, క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతిని కోరుతానని రాజీవ్‌ చెప్పారు. 

ప్రభుత్వ నియామకాల్లో రాజ్యాంగాన్ని పాటించాల్సిందే

ప్రభుత్వం చేపట్టే అన్ని నియామకాలన్నీ రాజ్యాంగాన్ని అనుసరించే ఉండాలని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. రాజ్యాంగంలోని 14వ అధికరణం (చట్టం ముందు సమానత్వం), 16వ అధికరణం (ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశం)లను తప్పకుండా పాటించాలని తెలిపింది. ఈ విషయంలో నియంతృత్వ విధానాలు, అపరిమిత విచక్షణకు తావు లేదని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజయ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. జమ్ము-కశ్మీర్‌లోని ప్రాథమిక పాఠశాలల్లో ‘టీచింగ్‌ గైడ్‌’ పోస్టుల నియామకానికి సంబంధించిన అప్పీలుపై తీర్పు ఇచ్చిన సందర్భంగా ఈ స్పష్టత ఇచ్చింది. 

బాణసంచాలో రసాయనాలు ఆందోళనకరం

బాణసంచా తయారీలో హానికర రసాయనాలు ఉపయోగించడం తీవ్ర ఆందోళనకరమని బుధవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు సీబీఐ నివేదిక ఇచ్చిందని తెలిపింది. టపాసుల తయారీలో బేరియంను వినియోగించడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. తయారీ సంస్థలైన హిందుస్థాన్‌ ఫైర్‌వర్క్స్‌, స్టాండర్ట్‌ ఫైర్‌వర్స్‌, ఇతర సంస్థలు భారీగా బేరియంను కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నట్టు చెన్నైలోని సీబీఐ సంయుక్త డైరెక్టర్‌ నివేదిక ఇచ్చినట్టు తెలిపింది. ఈ నివేదికను గురువారం సంబంధిత న్యాయవాదులందరికీ అందజేయాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెల ఆరో తేదీకి వాయిదా వేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని