Updated : 05 Oct 2021 15:02 IST

Third wave: ముందుంది మూడో ఉద్ధృతి ముప్పు

 జనవరి-ఏప్రిల్‌ మధ్య తీవ్రస్థాయికి చేరే అవకాశం

ఒక్కసారిగా పర్యాటకుల తాకిడి పెరిగితే కష్టం

శాస్త్రవేత్తల హెచ్చరిక

బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు పిలుపు

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నెల నుంచి కేసుల్లో క్రమంగా పెరుగుదల నమోదై.. వచ్చే జనవరి-ఏప్రిల్‌ మధ్య అది తీవ్రస్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఇంటాబయట అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు సందీప్‌ మండల్‌, నిమలన్‌ అరినమిన్‌పతి, బలరాం భార్గవ, శమిరణ్‌ పాండాలు రాసిన అధ్యయన పత్రం.. ‘జర్నల్‌ ఆఫ్‌ ట్రావెల్‌ మెడిసిన్‌’లో ప్రచురితమైంది. పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం, సామాజిక-రాజకీయ-మతపరమైన కారణాలతో ప్రజలు పెద్దఎత్తున గుమికూడటం వంటివి మూడో ఉద్ధృతికి దారితీయొచ్చని అందులో పేర్కొన్నారు. ఇటీవల పర్యాటకుల తాకిడి పెరిగిన తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలి, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు అధికమవడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.

అధ్యయన పత్రంలో ఇంకా ఏం చెప్పారంటే..

* రాష్ట్రాల స్థాయుల్లో ఆంక్షలను సరళతరం చేస్తే.. మూడో ఉద్ధృతి ముప్పు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.

* భారత్‌లో జన సాంద్రత ఎక్కువ. కాబట్టి మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసుల పెరుగుదల 103% వరకూ ఉండొచ్చు.

* కొవిడ్‌ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా.. పర్యాటకుల తాకిడి లేకపోతే మూడో ఉద్ధృతి తీవ్రత కొంతమేర తగ్గుతుంది. ఆంక్షల ఎత్తివేతతో పాటు సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగితే మాత్రం మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

* మనుషులు పరస్పరం దగ్గరగా ఉండి మాట్లాడుకుంటే.. కరోనా వంటి శ్వాసకోశ సంబంధ రోగాలు విస్తృతంగా వ్యాపించే అవకాశాలుంటాయి. హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. కరచాలనం చేసుకోవడం వంటి చర్యలతో ముప్పు ఇంకా పెరుగుతుంది.

* వాస్తవానికి సమాజ జీవనం క్రమంగా సాధారణ స్థితికి రావడం వల్ల మేలే జరుగుతుంది. దేశీయ పర్యాటకం పెరిగితే.. సందర్శకులకే కాకుండా, స్థానిక వ్యాపారులకూ లబ్ధి చేకూరుతుంది. కానీ- పర్యాటకులు, స్థానికులు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అందరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ ముందడుగు వేయడం సాధ్యమవుతుంది.


పండగల సీజన్‌లో జాగ్రత్త: గులేరియా

దేశానికి మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ప్రస్తుత పండగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కనీసం మరో 6-8 వారాల పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని విలేకర్ల సమావేశంలో ఆయన చెప్పారు.


 


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని