Pandora Papers: పన్ను ఎగవేతదారులకు హబ్‌గా లండన్‌!

ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారులకు లండన్‌ ఒక కీలక గమ్యస్థానంగా మారిందని నిపుణులు పేర్కొన్నారు. పన్ను మినహాయింపుల పేరుతో సంపన్నులకు, శక్తిమంతులకు ఇది ప్రధాన కేంద్రమైనట్లు ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ యూకే’ ఆరోపించింది.

Updated : 06 Oct 2021 08:14 IST

 పాండోరా పత్రాలతో బట్టబయలు

 నిబంధనలను కఠినతరం చేయాలని పలు సంస్థల డిమాండ్‌

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారులకు లండన్‌ ఒక కీలక గమ్యస్థానంగా మారిందని నిపుణులు పేర్కొన్నారు. పన్ను మినహాయింపుల పేరుతో సంపన్నులకు, శక్తిమంతులకు ఇది ప్రధాన కేంద్రమైనట్లు ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ యూకే’ ఆరోపించింది. అక్రమంగా డబ్బు దాచుకోవడానికి ఇది ఉపయోగపడుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్‌, పన్ను ఎగవేతల కట్టడికి నిబంధనలను బ్రిటన్‌ ప్రభుత్వం మరింత కఠినతరం చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

లండన్‌లో ఆఫ్‌షోర్‌ ఖాతాలు కలిగి ఉన్నవారిలో జోర్డాన్‌ రాజు కింగ్‌ అబ్దుల్లా-2, అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హామ్‌ అలీయేవ్‌ సహా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి సన్నిహితులు ఉన్నట్లు ‘పాండోరా పేపర్స్‌’ బయటపెట్టిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌ చట్టం ప్రకారం అవన్నీ చట్టబద్ధమైనప్పటికీ.. వీటిని ఆసరాగా చేసుకొని వారు పన్ను ఎగవేతకు పాల్పడుతున్న తీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
మెరుగైన సాంకేతికత, విస్తృత అవకాశాలకు లండన్‌ కేంద్ర బిందువుగా ఉంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న వివిధ రకాల సంస్థలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, శక్తిమంతమైన వ్యక్తులను ఆకర్షిస్తున్నాయి. 2019లో ‘గ్లోబల్‌ విట్‌నెస్‌’ అనే సంస్థ నివేదిక ప్రకారం ఇంగ్లాండ్‌, వేల్స్‌లోని దాదాపు 87,000 ఆస్తులు.. పన్నులు తక్కువగా ఉన్న దేశాల్లో నమోదైన అనామక కంపెనీలకు చెందినవే. వీటిలో దాదాపు 40 శాతం కంపెనీలు ఒక్క లండన్‌లోనే ఉన్నాయి. వీటి మొత్తం విలువ 135 బిలియన్‌ డాలర్లు కంటే ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బ్రిటన్‌ పార్లమెంట్‌కు అతి సమీపంలోని విలువైన ప్రాంతాల్లో ఉండడం గమనార్హం. లండన్‌ నడిబొడ్డున ఉన్న అనేక ఆస్తులు విదేశీయులవే కావడం చర్చనీయాంశమైంది.  

పన్ను మినహాయింపుల పేరుతో..

కొన్ని దశాబ్దాలుగా.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి బ్రిటన్‌ ప్రభుత్వం పన్ను మినహాయింపులను తీసుకొచ్చింది. ఇది పన్ను ఎగవేతదారులను ఆకర్షించే ఆయస్కాంతంలా పని చేస్తోందని విమర్శకులంటున్నారు. మనీ లాండరింగ్‌, పలు ఆర్థిక నేరాలకు ఆజ్యం పోస్తున్నట్లు చెబుతున్నారు. ఆఫ్‌షోర్‌ ఫైనాన్షియల్‌ సెంటర్లుగా పేరొందిన బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, కేమాన్‌ దీవుల్లోని కంపెనీలు తమ అసలు యజమానుల పేర్లను బహిర్గతం చేయకపోతే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ యూకే’ కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని