సముచిత పరిష్కారంతో రండి

దేశంలో వైద్య విద్య, వైద్య వృత్తి వ్యాపారంలా మారిపోయాయని, ఇప్పుడు వైద్య విద్య నియంత్రణ కూడా అదే తీరులోకి రావడం జాతీయ విషాదమని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష-2021కు నోటిఫికేషన్‌ వెలువడిన ...

Published : 06 Oct 2021 05:47 IST

 సిలబస్‌ మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి

నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష కేసులో కేంద్రానికి సుప్రీం స్పష్టీకరణ

దిల్లీ: దేశంలో వైద్య విద్య, వైద్య వృత్తి వ్యాపారంలా మారిపోయాయని, ఇప్పుడు వైద్య విద్య నియంత్రణ కూడా అదే తీరులోకి రావడం జాతీయ విషాదమని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష-2021కు నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత సిలబస్‌ మార్చడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా మంగళవారం న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ వ్యవహార తీరును నిలదీసింది. పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇస్తున్నామని, మార్పుచేసిన సిలబస్‌ను వెనక్కితీసుకోవాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం స్పష్టం చేసింది. బుధవారం ఉదయానికి సముచిత పరిష్కారంతో కోర్టు ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల మండలి(ఎన్‌బీఈ), జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)లను ఆదేశించింది. యువ వైద్యులకు కలిగే నష్టాన్ని నివారించేందుకు విచారణను కొనసాగిస్తామని తెలిపింది. నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష సిలబస్‌ను మార్చుతున్నట్లు అర్ధంతరంగా ప్రకటించడంపై అభ్యంతరం తెలుపుతూ 41 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డాక్టర్లు సుప్రీంను ఆశ్రయించారు. మంగళవారం కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాతి ఇచ్చిన వివరణకు ధర్మాసనం సంతృప్తి చెందలేదు. ‘ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకే సిలబస్‌లో మార్పు చేశారనే అభిప్రాయానికి ధర్మాసనం రావద్దు’ అని ఐశ్వర్య భాతి కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ...‘వైద్య విద్య, వైద్య వృత్తి వ్యాపారంగా మారిపోయిందనే అభిప్రాయం మాకు కలుగుతోంది. ఇప్పుడు వైద్య విద్య నియంత్రణ కూడా వ్యాపారంగా మారడం జాతీయ విషాదం’ అని పేర్కొంది. పరీక్షలకు రెండు మూడు నెలల ముందు సిలబస్‌ మార్చడం వల్ల వైద్య విద్యార్థులకు కలిగే ఇబ్బందులను అధికారులు గుర్తించాలని సూచించింది. వైద్య విద్య కోర్సులంటే ఒకటి రెండు నెలల ముందు చదివేవి కాదని పేర్కొంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని