AEOI: స్విస్‌ నుంచి మూడో చిట్టా

స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న మరికొందరు భారతీయులు, మరిన్ని భారతీయ కంపెనీల వివరాలు కేంద్ర ప్రభుత్వం చేతికి అందాయి.

Updated : 12 Oct 2021 16:00 IST

మరికొందరు భారతీయుల ఖాతాల వివరాలు లభ్యం

దిల్లీ, బెర్న్‌: స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న మరికొందరు భారతీయులు, మరిన్ని భారతీయ కంపెనీల వివరాలు కేంద్ర ప్రభుత్వం చేతికి అందాయి. ‘ఆటోమేటిక్‌ ఎక్ఛేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఏఈఓఐ)’ ఒప్పందంలో భాగంగా భారత్‌కు వాటిని అందజేసినట్లు స్విస్‌కు చెందిన ఫెడరల్‌ టాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 96 దేశాలతో 33 లక్షల ఖాతాల వివరాలను ఈ ఏడాది పంచుకున్నట్లు వెల్లడించింది. ఆ జాబితాలోని వ్యక్తులు, సంస్థల వివరాలను బహిరంగంగా వెల్లడించేందుకు మాత్రం నిరాకరించింది. స్విస్‌లో ఖాతాలున్న భారతీయులు, భారతీయ కంపెనీల వివరాలు మన దేశానికి అందడం ఇది మూడోసారి. 2019, 2020ల్లోనూ సంబంధిత జాబితాలను ఆ దేశం చేరవేసింది. తదుపరి జాబితా వచ్చే ఏడాది సెప్టెంబరులో అందనుంది. స్విస్‌ అందించే జాబితాల్లో ఆయా వ్యక్తులు/కంపెనీల పేర్లు, చిరునామా, దేశం, పన్ను గుర్తింపు సంఖ్య, బ్యాంకు ఖాతా తదితర వివరాలు అందుబాటులో ఉంటాయి.

స్విస్‌ నుంచి భారత్‌కు తాజాగా అందిన జాబితాలో వ్యాపారవేత్తలు, ఎన్నారైల పేర్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఆగ్నేయాసియా దేశాలతో పాటు అమెరికా, బ్రిటన్‌, కొన్ని ఆఫ్రికా దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు ఇందులో అధికంగా ఉన్నారని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని