Updated : 28 Nov 2021 10:23 IST

omicron: ఒమిక్రాన్‌కు టీకాలే మందు

శాస్త్రవేత్తల విశ్వాసం

లండన్‌: ఒమిక్రాన్‌.. ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ (బీ.1.1.529). దీని బారి నుంచి టీకాలు రక్షణ కల్పిస్తాయని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు గట్టిగా విశ్వసిస్తున్నారు. కొత్త వేరియంట్‌ ‘విపత్తు’ ఏమీ కాదని బ్రిటన్‌ ప్రభుత్వ సైంటిఫిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఫర్‌ ఎమర్జెన్సీస్‌కు చెందిన మైక్రోబయాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ కేలమ్‌ సెంపుల్‌ శనివారం చెప్పారు. ‘‘ఈ కొత్త వేరియంట్‌ గురించి కొందరు శాస్త్రవేత్తలు అతిగా చెబుతున్నారన్నది నా అభిప్రాయం. టీకాల ద్వారా లభించే రోగ నిరోధకశక్తి తీవ్రమైన వ్యాధి నుంచి మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంది. మహా అయితే జలుబు, తలనొప్పి, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలుండొచ్చు. ఐసీయూలో చేరాల్సి రావడం, మరణాల ముప్పు వంటివాటికి ఆస్కారం బాగా తక్కువే’’ అని సెంపుల్‌ చెప్పారు. కొత్త వేరియంట్‌ను బ్రిటన్‌ రాకుండా ఆపడం సాధ్యం కాకపోవచ్చని.. వీలయినంత మేర ఆలస్యం చేయడం ముఖ్యమని సెంపుల్‌ అన్నారు. ‘‘కొత్త వేరియంట్‌ మీ దేశంలోకి ప్రవేశించడం ఎంత ఆలస్యమైతే.. అంతమేర బూస్టర్‌ డోసులు వేసేందుకు సమయం దొరుకుతుంది. దీని ఆనుపానులు గుర్తించేందుకు శాస్త్రవేత్తలకు కూడా వ్యవధి లభిస్తుంది’’ అని చెప్పారు.

* ఒమిక్రాన్‌.. బ్రిటన్‌లో కొత్తగా మరో పెద్ద వేవ్‌ను సృష్టించడానికి అవకాశాలు చాలా తక్కువని టీకాల నిపుణుడు, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఆండ్రూ పొలార్డ్‌ చెబుతున్నారు. ఇది టీకాలను ఏమారుస్తుందని ఇప్పటికిప్పుడు చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. టీకాలు తీసుకున్నవారిలో కొత్త వేరియంట్‌.. ‘ముక్కు నుంచి నీరు కారడం, తలనొప్పి’తో పోతుందని వ్యాక్సిన్లకు సంబంధించి బ్రిటన్‌ ప్రభుత్వ అత్యంత సీనియర్‌ సలహాదారుల్లో ఒకరైన సర్‌ జాన్‌ బెల్‌ (ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ) అభిప్రాయపడ్డారు.   

* కొవిడ్‌-19 టీకాలు కొత్తగా బయటపడిన ఒమిక్రాన్‌ రకంపై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జో ఫాహ్లా తెలిపారు. జన్యుపరమైన మార్పుల కారణంగా ఒమిక్రాన్‌ వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని