omicron: ఆ 11 దేశాల నుంచి వస్తే.. ఆంక్షలు తప్పనిసరి!

ప్రపంచవ్యాప్తంగా ఐరోపాతో పాటు, మరో 11 దేశాల నుంచి విమానాల్లో వచ్చే ప్రయాణికుల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం మార్గదర్శకాలను జారీ చేసింది.

Updated : 29 Nov 2021 10:40 IST

కేంద్రం తాజా మార్గదర్శకాలు

అదనపు నిఘా ఉంచాలని సూచన

 

ఈనాడు, దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఐరోపాతో పాటు, మరో 11 దేశాల నుంచి విమానాల్లో వచ్చే ప్రయాణికుల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయా ప్రయాణికులంతా బయలు దేరడానికి ముందే స్వీయ ధ్రువీకరణ పత్రం, ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ను అప్‌లోడ్‌ చేయాలి. వారు విమానంలో అడుగుపెట్టడానికి ముందే.. వారివద్ద ఆ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉందో లేదో విమానయాన సంస్థలు ధ్రువీకరించుకోవాలి. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ (ఒమిక్రాన్‌) బయటపడిన నేపథ్యంలో.. ముప్పు ఉన్నట్లు భావిస్తున్న దేశాల నుంచి వచ్చేవారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. వారు భారత్‌లో దిగిన తర్వాత విమానాశ్రయంలో ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. ఒకవేళ నెగెటివ్‌ వచ్చినా.. 7 రోజులపాటు హోం క్వారెంటైన్‌లో ఉండాలి. 8వ రోజు మరోసారి పరీక్ష చేయించుకోవాలి. అప్పుడుకూడా నెగెటివ్‌ వస్తే తర్వాత 7 రోజుల పాటు తమ ఆరోగ్యాన్ని సొంతంగా గమనిస్తూ ఉండాలి. ఒకవేళ విమానాశ్రయంలో దిగిన వెంటనే చేసిన ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌లో గానీ, 8వ రోజు చేసిన పరీక్షలో గానీ పాజిటివ్‌ వస్తే వారి నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపాలి. వారిని ప్రత్యేకంగా ఏకాంతవాసంలో ఉంచాలి. ఒమిక్రాన్‌ లేదని తేలితే డాక్టర్‌ సూచన మేరకు డిశ్ఛార్జి చేయొచ్చు. కొత్త వేరియంట్‌ సోకినట్లు తేలితే వారికి మళ్లీ నెగెటివ్‌ వచ్చేంతవరకూ ప్రత్యేకంగా ఏకాంతవాసంలో ఉంచి వైద్యం అందించాలి.
* ముప్పు జాబితాలో లేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో మాత్రం 5% మందికి విమానాశ్రయాల్లో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాలి. పాజిటివ్‌ వస్తే వారి నమూనాలనూ జన్యుపరీక్షకు పంపి, నిబంధనల ప్రకారం వైద్యం అందించాలి. నెగెటివ్‌ వచ్చిన వారు 14 రోజులపాటు ఆరోగ్యాన్ని స్వయంగా గమనిస్తూ ఉండేలా సూచనలు చేస్తారు.
* స్వీయ పరిశీలన సమయంలో పరీక్షలు చేసినప్పుడు పాజిటివ్‌ వస్తే వెంటనే సమీప వైద్య ఆరోగ్య కేంద్రంలో సమాచారం అందించాలి.
* 5 ఏళ్లలోపు పిల్లలకు ఈ పరీక్ష నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. ఒకవేళ ఇంటికి వెళ్లిన తర్వాత లక్షణాలు కనిపిస్తే వారికి పరీక్షలు నిర్వహించి, ప్రొటోకాల్‌ ప్రకారం వైద్యం అందించాలి.

నిబంధనలు వర్తించే దేశాలివే..

బ్రిటన్‌ సహా ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయిల్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని