
దిల్లీలో వాయుకాలుష్యం.. బడులకు తాళం
దిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో దిల్లీ ప్రభుత్వం అన్ని పాఠశాలలను మూసివేసింది. శుక్రవారం నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ ఇది అమలులో ఉంటుందని, అప్పటివరకూ ఆన్లైన్లోనే బోధన కొనసాగుతుందని పేర్కొంది. బోర్డు పరీక్షలు మాత్రం షెడ్యూలు ప్రకారమే యథావిధిగా జరుగుతాయని తెలిపింది. పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ ఈ వివరాలను గురువారం వెల్లడించారు. వాయు కాలుష్యం కారణంగా నవంబరు 13న మూతపడిన విద్యా సంస్థలను గత సోమవారం తెరిచారు. కాలుష్యం తీవ్రంగా ఉన్నా బడులను ఎందుకు తెరిచారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించిన క్రమంలోనే ఆప్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘‘గాలి నాణ్యత మెరుగుపడుతుందని భావించి పాఠశాలల్లో భౌతిక తరగతులను ప్రారంభించాం. కానీ, కాలుష్య తీవ్రత పెరిగినందున శుక్రవారం నుంచి వాటిని మళ్లీ మూసివేస్తున్నాం’’ అని మంత్రి పేర్కొన్నారు. దిల్లీలో వాయు నాణ్యత గురువారం తీవ్రస్థాయి (సివియర్ జోన్)కు చేరింది. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడంతో పాటు స్థానికంగా విడుదలవుతున్న ఉద్గారాలే దిల్లీ వాయు కాలుష్యానికి 78% కారణమని ‘వాయు నాణ్యత, వాతావరణ అంచనా-పరిశోధన సంస్థ (సఫర్) వివరించింది.