Corona Vaccine: ఆస్ట్రాజెనెకా టీకాతో రక్తంలో గడ్డలు అందుకే..

ఆస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కొవిడ్‌ టీకాల వల్ల అరుదైన కేసుల్లో తలెత్తుతున్న రక్తపు గడ్డల గుట్టును శాస్త్రవేత్తలు విప్పారు. ఈ పరిస్థితికి దారితీస్తున్న అంశాలను వారు వెలుగులోకి

Updated : 03 Dec 2021 07:19 IST

గుట్టు విప్పిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: ఆస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కొవిడ్‌ టీకాల వల్ల అరుదైన కేసుల్లో తలెత్తుతున్న రక్తపు గడ్డల గుట్టును శాస్త్రవేత్తలు విప్పారు. ఈ పరిస్థితికి దారితీస్తున్న అంశాలను వారు వెలుగులోకి తెచ్చారు. మరింత మెరుగైన టీకాలను అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. చింపాంజీల్లోని అడినోవైరస్‌ సాయంతో ఈ టీకాలను అభివృద్ధి చేశారు. ఈ వైరస్‌ను వాహకంగా వాడారు. అందులో కరోనాకు సంబంధించిన జన్యు పదార్థాన్ని ఉంచి, మానవ కణాల్లోకి చేరవేశారు. అయితే అడినోవైరస్‌ ఆధారిత టీకాలు పొందాక చాలా స్వల్ప సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్‌ ఇమ్యూన్‌ థ్రాంబోటిక్‌ థ్రాంబోసైటోపీనియా (వీఐటీటీ) తలెత్తింది. దీన్ని థ్రాంబోసిస్‌ విత్‌ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్‌ (టీటీఎస్‌) అని కూడా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. ఇది ప్రాణాంతకం కూడా కావొచ్చు. దీని యంత్రాంగం అంతుచిక్కకుండా ఉంది.

దీనిపై అమెరికాలోని ఆరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ, బ్రిటన్‌లోని కార్డిఫ్‌ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఆస్ట్రాజెనెకా సంస్థతోనూ కలిసి పనిచేశారు. అరుదైన ఈ సమస్యకు టీకాలోని వైరల్‌ వాహకమే కారణమని తేల్చారు. ఇది మానవ శరీరంలోకి చేరాక అతి కొద్దిమందిలో రక్త ప్రవాహంలోకి ప్రవేశించి, ప్లేట్లెట్‌ ఫ్యాక్టర్‌ 4 (పీఎఫ్‌4)తో బంధనాన్ని ఏర్పరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా దాన్ని వెలుపలి వస్తువుగా రోగ నిరోధక వ్యవస్థ పరిగణిస్తోంది. ఈ పొరపాటు కారణంగా పీఎఫ్‌4కు వ్యతిరేకంగా యాంటీబాడీలు విడుదలవుతాయి. అవి ప్లేట్లెట్లకు అంటుకొని, వాటిని క్రియాశీలం చేస్తాయి. ఆ ప్లేట్లెట్లు ఒక్కచోట పోగుపడేలా చూస్తాయి. ఫలితంగా కొద్దిమందిలో రక్తపు గడ్డలు ఏర్పడతాయి. ఆస్ట్రాజెనెకా టీకాకు బలమైన రుణావేశం ఉందని, అది అయస్కాంతంలా వ్యవహరిస్తూ ధనావేశం కలిగిన పీఎఫ్‌4ను ఆకర్షిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని