
Bath: రోజుకు ఆరు సార్లు స్నానం చేస్తోంది.. విడాకులు ఇప్పించండి
రోజుకు ఆరుసార్లు స్నానం చేస్తూ.. ఇంట్లో అతిశుభ్రత పాటిస్తున్న భార్య ప్రవర్తనకు విసుగు చెందిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని కోరాడు. ఆ వ్యక్తి చెప్పిన ప్రకారం.. బెంగళూరులోని ఆర్టీ నగర్లో నివసిస్తున్న ఈ దంపతులకు 2009లో వివాహమైంది. బెంగళూరు రాకముందు కొంతకాలం లండన్‌లో ఉండేవారు. అప్పటి నుంచే భార్యకు శుభ్రతపైన శ్రద్ధ ఎక్కువ ఉండేది. మొదటి కాన్పు తర్వాత అది మరింత అధికమైంది. భర్తను బూట్లు, దుస్తులు, ఫోన్లూ తరచూ శుభ్రం చేయాలని కోరేది. భారత్‌కు తిరిగివచ్చినా ఆమె వైఖరిలో మార్పులేదు. డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా ఆమె.. ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) అనే మానసికవ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. కౌన్సెలింగ్ తర్వాత కాస్త మార్పు కనిపించింది. రెండోసారి బిడ్డకు జన్మనిచ్చాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. భర్త వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో అతని ల్యాప్‌టాప్, ఫోన్లను డిటర్జెంట్లతో శుభ్రం చేసేది. అందరూ స్నానాలు ముగించుకున్నాక వారు వాడిన సబ్బునూ శుభ్రం చేయడం సహా రోజుకు ఆరుసార్లు స్నానం చేసేది. విసుగు చెందిన భర్త ఆర్టీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ఉమన్ హెల్ప్‌లైన్ సెంటర్‌కు బదిలీ చేశారు.