Omicron: ఈ చికిత్సతో ‘ఒమిక్రాన్‌’ ఉఫ్‌!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను సమర్థంగా అణచివేసే సరికొత్త యాంటీబాడీ చికిత్స అందుబాటులోకి వచ్చింది! బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ గ్లాక్సోస్మిత్‌ క్లైన్‌ (జీఎస్‌కే) దీన్ని అభివృద్ధి చేసింది.

Published : 10 Dec 2021 01:27 IST

అన్ని మ్యూటేషన్లను సమర్థంగా అణచివేసిన కొత్త ఔషధం

లండన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను సమర్థంగా అణచివేసే సరికొత్త యాంటీబాడీ చికిత్స అందుబాటులోకి వచ్చింది! బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ గ్లాక్సోస్మిత్‌ క్లైన్‌ (జీఎస్‌కే) దీన్ని అభివృద్ధి చేసింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌లో సంతరించుకున్న మొత్తం 37 ఉత్పరివర్తనాలనూ సమర్థంగా అణచివేసేలా.. ‘సొట్రోవిమాబ్‌’ అనే ఔషధాన్ని రూపొందించింది. ప్రయోగశాలలో ఒమిక్రాన్‌ను పోలిన వైరస్‌పై ఈ మందును ప్రయోగించగా, అన్ని మ్యూటేషన్లను సమర్థంగా అణచివేసినట్టు తయారీ సంస్థ తాజాగా ప్రకటించింది. తొలిసారి దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌కు... ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్ల కంటే వేగంగా వ్యాపించే గుణముంది. కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ వ్యాపిస్తోంది. ప్రస్తుత చికిత్సలకు ఇది లొంగకపోవచ్చని, మరోసారి కొవిడ్‌ ఉద్ధృతి తప్పకపోవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో... న్యూయార్క్‌కు చెందిన వీర్‌ బయోటెక్నాలజీ సంస్థతో కలిసి జీఎస్‌కే సంస్థ ‘సోట్రోవిమాబ్‌’ను తీసుకొచ్చింది. ‘‘ప్రయోగ పరీక్షల్లో భాగంగా స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలున్న కొందరు కొవిడ్‌ బాధితులకు సోట్రోవిమాబ్‌ను ఇచ్చాం. వారిలో తీవ్ర అనారోగ్య, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు, మరణ ముప్పు 79% తప్పాయి’’ అని వీర్‌ బయోటెక్నాలజీ సీఈవో జార్జ్‌ స్కాన్గోస్‌ వెల్లడించారు. ఇప్పటికే బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ (ఎంహెచ్‌ఆర్‌ఏ) ఈ ఔషధానికి అనుమతులు మంజూరు చేసింది. బాధితుల్లో లక్షణాలు ప్రారంభమైన 5 రోజుల్లోనే దీన్ని అందించాలని సూచించింది. పలు దేశాలకు 7,50,000 డోసుల సొట్రోవిమాబ్‌ ఔషధం అందించేందుకు గ్లాక్సోస్మిత్‌ క్లైన్‌ ఒప్పందం చేసుకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని