Helicopter Crash: పొగమంచు వల్లే..!

భారత త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌ దంపతులు, మరో 11 మంది సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోయే కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది? అసలు ఆ ప్రమాదం ఎలా

Updated : 11 Dec 2021 09:43 IST

హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు ఏం జరిగింది?

‘ఈటీవీ భారత్‌’కు వివరించిన ప్రత్యక్ష సాక్షి

కోయంబత్తూరు: భారత త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌ దంపతులు, మరో 11 మంది సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోయే కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది? అసలు ఆ ప్రమాదం ఎలా సంభవించింది? అనే వివరాలను దుర్ఘటనకు కొద్ది సమయం ముందు చాపర్‌ను వీడియో తీసిన వై.జో అలియాస్‌ కుట్టి.. ‘ఈటీవీ భారత్‌’కు వివరించారు. కోయంబత్తూరుకు చెందిన కుట్టి వెడ్డింగ్‌ వీడియోగ్రాఫర్‌. చాపర్‌ ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు తీసిన ఓ వీడియో ఆ మరుసటి రోజున బయటకు వచ్చింది. ‘‘డిసెంబరు 8న నా స్నేహితుడు నాసర్‌, నేను, నా కుటుంబంతో కలిసి ఊటీ సమీపంలోని కట్టేరి ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లాం. కొండ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌పై వెళ్తూ వీడియో తీస్తున్నాం. అప్పుడే హెలికాప్టర్‌ను చూశాం. దాని శబ్దం కొంచెం తేడాగా అనిపించడంతో వీడియో తీయడం ప్రారంభించా. ఆ సమయంలో దట్టమైన పొగ మంచు ఆవరించి ఉంది. కొన్ని క్షణాల్లోనే హెలికాప్టర్‌ కనిపించకుండా పోయింది. ఆ వెంటనే భారీ పేలుడు శబ్దం వినపడింది. ఇది కేవలం 4-5 సెకన్లలోనే జరిగిపోయింది. ఘటనాస్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించాం. కానీ, పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. సమీపంలోని మా స్నేహితుడి ఇంటికి వెళ్లాం. ఆ తర్వాత హెలికాప్టర్‌ ప్రమాదంపై పూర్తి వివరాలు టీవీలో చూసి తెలుసుకున్నాం’ అని జో వివరించారు. వీడియో అందించేందుకు ముందుగా నీలగిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లామని, అక్కడ అధికారులెవరూ లేరని తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లాలన్న కానిస్టేబుళ్ల సూచనతో అక్కడికి వెళ్లి ఇన్‌స్పెక్టర్‌ దేవరాజన్‌కు వీడియో ఫుటేజ్‌ను అందించినట్లు చెప్పారు. దట్టమైన పొగ మంచులో వెళుతున్న హెలికాప్టర్‌ను చూశామని, ఆ వెంటనే కూలిపోయిన శబ్దం విన్నట్లు పోలీసులకు వివరించామన్నారు.


దర్యాప్తు ముమ్మరం

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-కోయంబత్తూరు: తమిళనాడు నీలగిరి జిల్లా కున్నూర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంపై విచారణ ముమ్మరమైంది. త్రిదళాల తరఫున నియమించిన దర్యాప్తు అధికారి ఎయిర్‌మార్షల్‌ మానవేంద్రసింగ్‌ శుక్రవారం ఘటనాస్థలిన్ని పరిశీలించారు.  ఎంఐ17వీ5 హెలికాప్టర్‌ను రష్యా సంస్థ తయారుచేసింది. ప్రమాదం వెనక అందులోని సాంకేతిక కారణాల్ని విశ్లేషించడానికి రష్యా నిపుణులనూ సంప్రదిస్తున్నట్లు తెలిసింది.


విషమంగానే వరుణ్‌సింగ్‌ ఆరోగ్యం

దిల్లీ: తమిళనాడులోని కున్నూర్‌ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వాయుసేన (ఐఏఎఫ్‌) గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. బెంగళూరులోని కమాండ్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని