
ప్రమాదాల్లో గాయపడిన వారికితొలి 48 గంటల చికిత్స ఉచితం..
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించడమే లక్ష్యం
ట్రిప్లికేన్, న్యూస్టుడే: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించేందుకు ‘నమ్మై కాక్కుం 48’ (48 గంటల్లో ప్రాణాలు కాపాడుదాం) పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి 48 గంటలు అత్యవసర చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. తొలి విడతగా రాష్ట్రంలోని 609 ఆసుపత్రుల్లో ఈ పథకం అమలు కానుంది. బాధితులను ఆసుపత్రుల్లో చేర్పించే వారికి ప్రోత్సాహకంగా రూ.5 వేలు అందించనున్నారు. రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు కూడా అర్హులే. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించడానికే ఈ పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. తమిళనాడును అగ్రగామిగా నిలపడమే లక్ష్యమన్నారు. అందరూ రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. అనంతరం ఆదిపరాశక్తి ఫౌండేషన్ వైద్య కళాశాల ఆసుపత్రిలో... రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రంగనాథన్ అనే వ్యక్తిని పరామర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.