Omicron: ఒమిక్రాన్‌ మూలాల్లో హెచ్‌ఐవీ!

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌కు.. అనూహ్య వేగంతో వ్యాపించి, టీకా తీసుకున్న వారిలోనూ ఇన్‌ఫెక్షన్‌ కలిగించేంత శక్తి ఎలా వచ్చింది? దక్షిణాఫ్రికాలో.. ఉన్నా, లేనట్టే అన్నట్టు బలహీనపడిన కరోనా వైరస్‌ ఉన్నఫళంగా ఒమిక్రాన్‌గా ఎలా రూపాంతరం చెందింది?

Updated : 22 Dec 2021 06:44 IST

జొహన్నెస్‌బర్గ్‌: ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌కు.. అనూహ్య వేగంతో వ్యాపించి, టీకా తీసుకున్న వారిలోనూ ఇన్‌ఫెక్షన్‌ కలిగించేంత శక్తి ఎలా వచ్చింది? దక్షిణాఫ్రికాలో.. ఉన్నా, లేనట్టే అన్నట్టు బలహీనపడిన కరోనా వైరస్‌ ఉన్నఫళంగా ఒమిక్రాన్‌గా ఎలా రూపాంతరం చెందింది? -ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలను తొలిచేస్తున్నాయి. సమాధానాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్‌ మూలాల్లో హెచ్‌ఐవీ ఉంది అని ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు!

అదెలా?
ఐరాస దేశాల హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ సంయుక్త నియంత్రణ కార్యక్రమం ‘యూఎన్‌ఎయిడ్స్‌’ నిరుడు ఓ నివేదిక ఇచ్చింది. దక్షిణాఫ్రికాలో 18-45 ఏళ్ల వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్‌ఐవీకి గురయ్యారని, ప్రపంచ హెచ్‌ఐవీ కేంద్రంగా ఆ దేశం మారిందని పేర్కొంది. ఈ వైరస్‌ సోకినవారిలో 30% పైగా మంది అసలు యాంటీరిట్రోవైరల్‌ డ్రగ్స్‌ని తీసుకోవడమే లేదని వివరించింది. హెచ్‌ఐవీ సోకినా ఎలాంటి మందులు వాడనివారి రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనపడి, ఇతరత్రా వ్యాధులకు ఆలవాలంగా మారుతుంది. సరిగ్గా ఇలాంటి మహిళే కరోనా బారిన పడిందని, ఆమె శరీరంలోని హెచ్‌ఐవీ వైరస్‌ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి ఉంటుందని పరిశోధకులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన డా.కెంప్‌ బృందం కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. హెచ్‌ఐవీ వైరస్‌ తిష్ఠవేసిన శరీరంలో కరోనా విజృంభించడానికి చాలా అనువైన పరిస్థితులుంటాయి. దక్షిణాఫ్రికాలో హెచ్‌ఐవీ బాధితులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, అక్కడే ఒమిక్రాన్‌గా అవతరించి ఉండొచ్చు’’ అని డా.కెంప్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని